తెలంగాణ ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ వాయిదా.. మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా డీఎస్సీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. డీఎస్సీలో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ) పరీక్షలను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగానే వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఇప్పటికే టీసీఎస్ అయాన్ సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. నవంబర్ చివరి వారంలో మాత్రమే స్లాట్లు ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడు తప్పితే మళ్లీ ఫిబ్రవరి వరకు స్లాట్లు ఖాళీగా లేవని టీసీఎస్ విద్యాశాఖకు స్పష్టం చేసింది.
దీంతో ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి కాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబర్‌లోనే పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. కానీ ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.