LRS permissions | ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులపై ప్రభుత్వం స్పష్టత

2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నియమ నిబంధనలు జారీ చేసింది.

Reported by: Somu | తెలంగాణ‌ | Aug 16, 2024, 6:46 pm IST
Read Time: 3 mins
LRS permissions | ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులపై ప్రభుత్వం స్పష్టత

పరిగణలోకి 2020 ఆక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు

LRS permissions | 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నియమ నిబంధనలు జారీ చేసింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లేఅవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020 అక్టోబరు 15వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. నియమ నిబంధనలు 2020లో విడుదల చేసినప్పటికీ ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన మొదలైందని తెలిపారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్టు చెప్పారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS) దరఖాస్తుల్లో 60,213 దరఖాస్తులు ఆమోదం పొందగా.. రూ.96.60 కోట్లు వసూలైనట్టు వివరించారు. దాదాపు 75శాతం దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదన్నారు. “తగిన డాక్యుమెంట్లు లేవని దరఖాస్తుదారులకు ఇప్పటికే తెలియజేశామని, వాటిని అప్ లోడ్‌ చేయడం కుదరకపోగా, సకాలంలో ప్రాసెస్ చేయలేకపోయామన్నారు.

డాక్యుమెంట్లు అందజేసేందుకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించామని, సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ సర్టిఫికెట్, లేఅవుట్ కాపీలను అప్ లోడ్‌ చేయవచ్చని పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా ఇతర వివరాలను మొబైల్ నెంబర్ ఓటీపీ ఉపయోగించుకుని సవరించుకోవచ్చన్నారు. ఎల్ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు సందేహాలుంటే హెల్ప్ డెస్క్‌ను సందర్శించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ది సంస్థలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.