corruption । విద్యుత్తు శాఖలో లంచాలు అడిగితే.. ఈ ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు
విద్యుత్తు సంస్థలో అవినీతిని సహించేది లేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. తమ సిబ్బంది లేదా అధికారులు ఎవరైనా ఏదైనా పనికి లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫోన్ చేసి తెలియజేయాలని ఒక ప్రకటనలో కోరారు.

corruption । విద్యుత్తు సంస్థల్లో అవినీతిని పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. విద్యుత్తు శాఖలో అవినీతిపై ఇక్కడ ఫిర్యాదులు స్వీకరిస్తారు. గత నాలుగు రోజులుగా ఈ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న అధికారులు.. తప్పు చేసినట్టు తేలినవారిపై చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే మెదక్ శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ బీ దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ పీ భిక్షపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక పనికి సంబంధించిన అంచనాలు రూపొందించి, వర్క్ ఆర్డర్ విడుదల చేసేందుకు దుర్గాప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్నాడని సీఎండీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది. దీనిపై క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సంస్థలో అవినీతిని సహించేది లేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. తమ సిబ్బంది లేదా అధికారులు ఎవరైనా ఏదైనా పనికి లంచం డిమాండ్ చేస్తే వెంటనే 040 – 2345 4884 లేదా 768 090 1912 నంబర్‌లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఒక ప్రకటనలో కోరారు.