SC Categorization : రిజర్వేషన్లను పెంచడమే కాదు.. వాటి అమలు బాధ్యత కూడా మాదే!

వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామ‌ని, రిజ‌ర్వేష‌న్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని స్పష్టంచేశారు.

SC Categorization : రిజర్వేషన్లను పెంచడమే కాదు.. వాటి అమలు బాధ్యత కూడా మాదే!

SC Categorization : రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది అని, దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లుపై మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో మన వాదనలు వినిపించామ‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేశామని తెలిపారు. ఆ వెంట‌నే నీటి పారుద‌ల శాఖ మంత్రి ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, న్యాయ నిపుణులను సంప్రదించి జ‌స్టిస్ ష‌మీమ్ అక్త‌ర్ నేతృత్వంలో వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామ‌న్నారు.

59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచుతున్నామ‌ని వివ‌రించారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామ‌ని, రిజ‌ర్వేష‌న్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని స్పష్టంచేశారు. ‘సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా.. ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరుగదు. రిజర్వేషన్లను పెంచి, వాటిని అమలు చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం’ అని ప్రకటించారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిందని, తుద‌కు న్యాయం జ‌రిగింద‌ని రేవంత్ రెడ్డి ఉద‌హ‌రించారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని చెప్పారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామ‌న్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన సందర్భం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఆయ‌న చాంబర్‌లో మాదిగ, మాదిగ ఉప కులాల‌కు చెందిన ఎమ్మెల్యేలు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.