కృష్ణా జలాల విషయంలో తగ్గేదేలేదు: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు కేటాయించాల్సిన వాటా గురించి నేడు ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు

ఢిల్లీ: కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు కేటాయించాల్సిన వాటా గురించి నేడు ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. పాత కేటాయింపుల ప్రకారం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కేటాయింపు జరిగింది. అయితే బేసిన్ ఏరియా, జనాభా, సాగుభూమి ఆధారంగా 70% కేటాయింపు రావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కృష్ణా నుంచి 555 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుంచి 45 టీఎంసీలు కలిపి మొత్తం 763 టీఎంసీలు కావాలని తెలంగాణ స్పష్టంగా వాదించింది. దీనితోపాటు కర్ణాటకలో ప్రాజెక్టుల ఎత్తు పెంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని, కృష్ణా–గోదావరి జలాల్లో న్యాయం సాధించడమే లక్ష్యమని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే అంశాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ వాటా విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో మా వాటా కోసం రాజీలేని పోరాటం ఉంటుందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు తెలంగాణ వాదన వినిపించనుందని తెలిపారు. తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారన్నారు. హైదరాబాదులో కృష్ణ ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించే విషయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బ్రీఫింగ్ జరిగిందని అన్నారు. కృష్ణా నది జలాల్లో రావాల్సిన వాటా పై వాదనలు వినిపిస్తున్నామన్నారు. అండర్ సెక్షన్ 3 రిఫరెన్స్ పై ప్రస్తుతం విచారణ జరుగుతుందన్నారు.
ఫిబ్రవరి నుంచి వాదనలు వినిపిస్తున్నాం, ప్రస్తుతం తెలంగాణ తుది వాదనలను వినిపిస్తుందన్నారు. తెలంగాణలో కృష్ణ ప్రవాహం, క్యాచ్ మెంట్ ఏరియా.. పాపులేషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మా వాటా నిర్ణయించాలన్నారు. 70 శాతం నీటి వాటా కేటాయించాలని కోరుతున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మేం ఏకీభవించడం లేదన్నారు. అందుకే ఫైల్ రీఓపెన్ చేసి మొదటినుంచి వాదనలను వినిపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.