Telangana HAM roads scam| తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ : మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ ఆర్ ఆండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ -HAM) రోడ్ల పనులలో రూ. 18వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. టెండర్లలో ఎక్సెస్ ఎత్తివేసి.. 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారు అని, తద్వార రూ. 1800 కోట్లు నేరుగా కాంగ్రెసోళ్ల జేబుల్లోకి పోతున్నాయి అని, ఆ డబ్బులను నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని హరీశ్ రావు ఆరోపించారు.

Telangana HAM roads scam| తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ : మాజీ మంత్రి హరీశ్ రావు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్ ఆండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ -HAM) రోడ్ల పనులలో రూ. 18వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో హరీష్ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పేరిట ఆర్ఆండ్ బీ శాఖలో రూ. 12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ. 6000 కోట్ల పనులకు టెండర్లు పెట్టారని, 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారు అని, తద్వార రూ. 1800 కోట్లు నేరుగా కాంగ్రెసోళ్ల జేబుల్లోకి పోతున్నాయి అని, ఆ డబ్బులను నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని హరీశ్ రావు ఆరోపించారు.

నాడు గగ్గోలు..నేడు స్కామ్ లు

వైస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం కాదు ధనయజ్ఞం..మొబిలైజేషన్ అడ్వాన్స్‌లతో కాంగ్రెస్ నాయకులు దండుకుంటున్నారని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఈయన ప్రభుత్వం 10 శాతం మొబిలైజేషన్ ఇస్తూ భారీ స్కామ్ కు పాల్పడుతుందని హరీశ్ రావు ఆరోపించారు. చాలా పనులకు బిల్లులు ఇవ్వడం లేదు, రోడ్లకు గుంతలు పడినా మరమ్మతులు చేయడం లేదు అని, కమిషన్ల కోసం హ్యామ్ రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారు అని హరీశ్ రావు విమర్శించారు.

15నుంచి 20శాతం ఎక్సెస్ తో టెండర్లు

దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయి అని, తెలంగాణలో హ్యామ్ రోడ్ల పనుల టెండర్లు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి.. తేడా 50 శాతం వస్తోంది అని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారు అని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసింది అని,
నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే.. ఇప్పుడు 10 శాతం పెట్టారు అని హరీశ్ రావు పేర్కొన్నారు. మొత్తం 34 పనులకు సంబంధించి ఇప్పటివరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారు అని..ఇది చూస్తే ముందే రింగ్ అయ్యారు అని అర్ధం అవుతుందన్నారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారు అని ఆరోపించారు.

రాష్ట్రంలో టెండర్ యాక్సెస్‌కు 5 శాతం సీలింగ్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత హ్యామ్ రోడ్లలో యాక్సెస్ ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకునే పరిస్థితి ఏర్పడిందని, హ్యామ్ రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్‌లోని 12 పనులను కూడా ఇప్పటికే కమిషన్లు మాట్లాడుకుని పంపకాలు చేశారు అని ఆరోపించారు.

నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి అని, నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారు అని, రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారు అని వెల్లడించారు. టెండర్లలో సివేట్, సరళ, బృందా,
బీవీఎస్ఆర్ కంపెనీలు కుమ్మక్కయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖలో 7 వర్కులు సివేట్‌కు, 3 వర్కులు జే ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్, బృందాకు ఇచ్చారు అని తెలిపారు.

టెండర్లు రద్దు చేసి..విచారణ జరిపించాలి

హ్యామ్ రోడ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, టెండర్లు రద్దు చేసి దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్‌కు, రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తాం అన్నారు. సీవీసీ, ఆర్బీఐ సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని, టెండర్లలో పాలుపంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాం అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలి.. పారదర్శంగా నిర్వహించాలని కోరారు. హ్యామ్ రోడ్ల పనులకు సీఓటీ అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలి అని, మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పద్దులపై అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు బీఆర్ఎస్ తరపున ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని ఆధారాలు బయటపెడతాం, హైకోర్టు విచారణకు పట్టుబడతాం అని వెల్లడించారు.