Siricilla Collector : సిరిసిల్ల కలెక్టర్‌కు హైకోర్టు మరో షాక్
మిడ్ మానేరు నిర్వాసితురాలికి నష్టం చెల్లింపులపై సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విధాత): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి నష్ట పరిహారం చెల్లించకపోవడంతో సదరు నిర్వాసితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సదరు కలెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మిడ్ మానేరు నిర్వాసితురాలికి గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని తెలిపింది. అయితే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అంశంపై ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు రావడంతో అతనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.