High Court – Hydra | ఆ భూమి జోలికి వెళ్లకండి.. : హైడ్రాకు హైకోర్టు ఆదేశం
శేరిలింగంపల్లి గుట్టలబేగం పేట సర్వే 16 భూమిపై హైడ్రా జోక్యాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూమి యజమానులను ఇబ్బందిపెట్టవద్దని ఆదేశాలు.
High Court – Hydra | శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగం పేట రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 16లోని 10 ఎకరాల 20 గుంటల భూమి జోలికి వెళ్లవద్దని హైకోర్టు హైడ్రా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సంబంధిత భూమి యజమానులను ఇబ్బందిపెట్టవద్దని పేర్కొన్నది. ఈ మేరకు భూమి యజమానులు బుధవారం (19.11.2025) తేదీన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ఉత్తర్వులతోపాటు దరఖాస్తును అందజేశారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తమ భూమిపైకి వచ్చి ఇబ్బంది పెట్టవద్దని అందులో కోరారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగం పేటలోని సర్వే నంబర్ 16లో 10 ఎకరాల 20 గుంటల భూమి వై అంతిరెడ్డి సహా 9 మంది పేర్లపై ఉన్నది. సున్నం చెరువుకు సమీపంలో ఉన్న ఈ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధుల్లోకి వస్తుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తమ భూమిలో ఫెన్సింగ్ వేయడానికి జేసీబీలను తీసుకువచ్చి భూమిని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా ప్రయత్నించారని, తమ భూమిని ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నిస్తే తమకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.
వాస్తవానికి తమ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో లేదని పిటిషనర్లు తెలిపారు. గతంలోనే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఇక్కడ సర్వే చేసి, ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే తమ కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారని, బఫర్ జోన్‌లోకి వచ్చే 30 మీటర్ల భూమిని స్వాధీనం చేసుకుని, అందులో వంద అడగుల రోడ్డును నిర్మించారని తెలిపారు.
ఎఫ్‌టీల్ పరిధి నుంచి 30 మీటర్లలోపు ఎలాంటి కట్టడాలు ఉండకూడదని 07.04.2012లో ఇచ్చిన జీవో 168 పేర్కొంటున్నది. దీని ప్రకారంగా చూసినా తమ భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండే ఆస్కారమే లేదని, బఫర్‌జోన్‌లో కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోకి రాని తమ భూమి విషయంలో జోక్యం చేసుకునేందుకు హైడ్రా అధికారులకు ఎలాంటి అధికారం లేదని కోర్టుకు విన్నవించారు. ఇది పట్టాభూమి కావడంతో బఫర్ జోన్ మీదుగా వెళ్లిన వంద ఫీట్ల రోడ్డుకు జీహెచ్‌ఎంసీ తమకు డెవలప్‌మెంట్ రైట్స్ సర్టిఫికెట్ రూపంలో దాదాపు ఎకరంన్నర భూమికి నష్టపరిహారం కూడా చెల్లించిందని కోర్టుకు తెలిపారు.
హైడ్రా అధికారులు రాత్రి పూట భూముల్లోకి వచ్చి, బుల్డోజర్లతో భవంతులను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేస్తున్న అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్లు.. తమ భూమిలోని నిర్మాణాల విషయంలోనూ ఇలానే జరుగుతుందేమోననే ఆందోళనలు వ్యక్తం చేశారు. తమ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ల పరిధిలో లేనందున వారిని జోక్యం చేసుకోవద్దని ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పిటిషనర్‌ల అనుభవంలో ఉన్న భూమి విషయంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని పేర్కొంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram