Ponnam Prabhakargoud | ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి గుండు సున్నా … కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం : మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో గుండు సున్నానే దక్కిందని, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయమే మిగిలిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మండిపడ్డారు

Ponnam Prabhakargoud | ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి గుండు సున్నా … కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం : మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో గుండు సున్నానే దక్కిందని, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయమే మిగిలిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మండిపడ్డారు. కేంధ్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నేరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కారని గుర్తు చేశారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ 2 గంటల ప్రసంగంలో కనీసం తెలంగాణ అనే పదం కూడా ఎత్తలేదన్నారు. తెలంగాణ సీఎం, మంత్రులం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధుల కోసం ఇచ్చిన వినతి పత్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన లో చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించారని, . మరి ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని పొన్నం ప్రశ్నించారు. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్నారని, తెలంగాణ ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని వేడుకున్న ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి గంగానది ప్రక్షాళనకు వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేట నుండి మూసీ నది పోతుంది అయినా ఒక్క రూపాయి అయినా కేటాయించలేదన్నారు. 10 సంవత్సరాలుగా నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడగకపోతే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవనే కారణాలు చూపెట్టారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని ప్రతిపాదనలు వచ్చి రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ,రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ పరంగా ,ఇతర అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అన్యాయంగా ఉందన్నారు.

అధికారం కోసమే ఆ రాష్ట్రాలకు నిధులు

ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకుకు కారణమైన ఆంధ్రప్రదేశ్ , బీహార్ కు భయపడి అధికారాన్ని కాపాడుకునేందుకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని మంత్రి పొన్నం ఆరోపించారు. ఇది నరేంద్ర మోదీ లోపభూయిష్టమైన విధానాన్ని చూపిస్తుందన్నారు. ఈరోజు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈ రాష్ట్రానికి రాకుండా పోయి గుజరాత్ కో, బీహార్ కో పొమ్మని కోరుతున్నామన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ మాత్రం తేలేని అసమర్థులు ఈ రాష్ట్రం నుండి మంత్రులుగా ఉండడం మంచిది కాదన్నారు. 8 మంది ఎంపీలను గెలిపించిన ఈ రాష్ట్రంలో బీజేపీ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత పదేళ్లలో బీఆరెస్‌కు కేంద్రంకు సఖ్యత లేదని, కానీ ఇప్పుడు మేము అన్ని రకాలుగా అడుగుతున్నప్పటికి నిర్లక్ష్యం చేయడం అంటే ఈ తెలంగాణ ప్రజలను, నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అవమాన పరచడమేనన్నారు. విభజన హామీలు అమలు చేయకపోవడం పట్ల వారి చిత్తశుద్ది స్పష్టం అవుతుందన్నారు.