జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెంచింది. ప్రస్తుత కార్డులు, బస్ పాస్ ల గడువును జూన్ 16వరకు పెంచుతూ రెన్యూవల్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్, బసా పాస్ లను రెన్యూవల్ చేసుకోవాని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి జి.ముకుందరెడ్డి సూచించారు.
కొత్త కార్డులను జారీ చేయకపోవడంతో పాటు, అక్రిడిటేషన్ రూల్స్ మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 252ను సవాల్ చేస్తూ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సహా పలు సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ సందర్బంగా హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు కార్డుల గడువును ప్రభుత్వం జూన్ 16 వరకు పొడిగించడం విశేషం. హైకోర్టులో తదుపరి విచారణ జూన్ 16న ఉండటం గమనార్హం. కొత్త కార్డుల జారీలో నెలకొన్న జాప్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022-2024 సంవత్సరానికి జారీ చేసిన పాత అక్రిడిటేషన్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదే పదే పొడిగిస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు జారీ చేస్తామని ప్రకటించినప్పటికి..కొత్త కార్డుల జారీ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం కొనసాగుతుంది.
