Kalvakuntla Kavitha| జనం బాటలో.. కదిలిన కవితమ్మ !
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తిరిగి ప్రజల్లోకి అడుగుపెట్టింది. “జనం బాట” అని పేరు పెట్టిన ఈ పబ్లిక్ యాత్ర, గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళి అర్పించడంతో ప్రారంభమైంది. మొత్తం నాలుగు నెలలు, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు చుట్టేస్తూ ప్రజల మాట వింటానన్నారు. ప్రజలతో నేరుగా కూర్చుని సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలో దిశ నిర్ధేశం చేస్తానని చెబుతున్నారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేపట్టిన జనం బాట యాత్ర(Janam Bata Yatra)ను ప్రారంభించారు. శనివారం ఉదయం తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు బయల్దేరిన కల్వకుంట్ల కవిత అమరవీరులకు నివాళులర్పించి అక్కడి నుంచి నిజమాబాద్ జిల్లా ఇందల్వాయికి బయలుదేరారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలంతా బాగుండాలన్న లక్ష్యంతో తెచ్చుకున్న తెలంగాణలో అమరవీరుల, ఉద్యమకారులు ఆశయాలు నెరవేరలేదన్నారు. అందుకే ఆత్మగౌరవంతో కూడిన అందరి అభివృద్ధి కోసం సామాజిక తెలంగాణ సాధనకు జాగృతి పోరాడుతుందన్నారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్య సాధన దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ నిర్ధేశం కోసం నేను జనం బాట యాత్రను ప్రారంభించి రాష్ట్రంలోని 33జిల్లాలు, 119నియోజకవర్గాలను నాలుగు నెలల పాటు పర్యటించబోతున్నానని తెలిపారు. జనం బాట ద్వారా అన్ని వర్గాల ప్రజలను, యువతను, మేధావులను కలిసి వారితో సామాజిక తెలంగాణ సాధన ఏజెండాపై చర్చించడం జరుగుతుందన్నారు. అందరు కలిసుంటేనే అందమైన బతుకమ్మలా బాగుంటుందని, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కోసం సామాజిక తెలంగాణ సాధన బాటలో కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు.
పదేళ్లలో అమరవీరులకు న్యాయం జరుగలే..క్షమాపణలు చెబుతున్నా
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పదేళ్లలో తగిన న్యాయం జరుగలేదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులలో అమరులైన 1200 మందిని గుర్తించిన ప్రభుత్వం కేవలం 580 మంది కుటుంబాలకు రూ.10లక్షలు, ఉద్యోగంతో సరిపెట్టిందన్నారు. మిగతావారికి న్యాయం చేయలేదని..ఉద్యమ కారులకు కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జడ్పీటీసీ టిక్కెట్ల అవకాశం వచ్చినా..వేలాదిమందికి జరుగాల్సిన న్యాయం జరుగలేదు అన్నారు. నేటికి ఉద్యమకారుల ఫోరంల పేరుతో ప్రతి మండలంలో ఇంకా ఆందోళనలు చేస్తున్నారని కవిత గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా లేకపోయినా, ఎంపీ, ఎమ్మెల్సీగా చేశానని..ఆ సందర్బంలో అమరవీరుల సమస్యను లేవనెత్తి కొట్లాడినప్పటికి మరింత గట్టిగా పోరాటం చేయాల్సిందన్నారు. అమరవీరులకు తగిన న్యాయాన్ని అందించలేని అంశంలో తాను అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇప్పుడు అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని..అమరులు 1200మందికి కుటుంబానికి కోటీ రూపాయాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతే దీన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పించేందుకు కృషి చేస్తానని కవిత ప్రకటించారు. పోలీసుల రిపోర్టుల ఆధారంగా కాకుండా, ప్రజాదర్బార్ లు పెట్టుకుని అమరులను గుర్తించి పెన్షన్ వచ్చేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరులకు 250గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇవ్వలేదని, అది సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
సర్కార్ పై జాగృతి జంగ్ సైరన్
అందరికి సమాన న్యాయం, అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం దక్కాలన్న అమరుల ఆశయ సాధక కోసం జాగృతి బీసీ రిజర్వేషన్ల కోసం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల సాధనకు పోరాడుతుందని కవిత గుర్తు చేశారు. అగ్రకుల పేదలకు బాసటగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆగం పట్టిస్తుందని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసిందని కవిత మండిపడ్డారు. స్వరాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని దీనిపై జాగృతి పోరాటం చేస్తుందని, నీళ్లలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధనకు, సామాజిక తెలంగాణ సాధనకు కాంగ్రెస్ సర్కార్ పై జాగృతి జంగ్ సైరన్ మోగించిందని..ఈ పోరాటంంలో అందరు కలిసిరావాలని, కలిసి కొట్లాడుదామని కవిత కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అనిల్ కుమార్, అంజిరెడ్డిలు కవిత జనం బాటకు సంఘీభావం తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram