Medaram Master Plan | మాస్టర్‌ప్లాన్‌తో మేడారం అభివృద్ధి.. జాతరనాటికి పనులు పూర్తి : మంత్రి సీతక్క

Medaram Master Plan | మాస్టర్‌ప్లాన్‌తో మేడారం అభివృద్ధి.. జాతరనాటికి పనులు పూర్తి : మంత్రి సీతక్క

Medaram Master Plan | విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో చేపట్టే అభివృద్ధి పనులను శాశ్వత ప్రతిపాదికన నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇప్పటికే కొన్ని శాశ్వత పనులు చేపట్టారు. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు జంపన్న, పగిడిద్దరాజుల గద్దెల డిజన్ ను మార్చేందుకు దేవాదాయశాఖ ప్రయత్నిస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రఖ్యాతిగాంచింది. సమ్మక్క, సారలమ్మలను గిరిజనులు తమ ఇలవేల్పులుగా భావిస్తారు. రెండేళ్లకోసారి జాతర సందర్భంగా వనం నుంచి సమ్మక్క, సారలమ్మల, గోవిందరాజు, పగిడిద్దరాజులు మేడారం జాతర ప్రాంగణంలోని గద్దెలపైకి వడ్డెలు తీసుకొస్తారు. మూడు రోజుల పాటు కొలువుదీరి ఈ గద్దెల పైన్నే దర్శనమిస్తుంటారు. దేవతల వనప్రవేశంతో మహాజాతర ఘట్టానికి తెరపడుతోంది. ఇటీవల జాతర సమయంలోనే కాకుండా నిత్యం మేడారం జాతరకు భక్తుల తాకిడి పెరిగింది. అక్కడ గద్దెలతోపాటు నెమలినార చెట్టు, కంకబొంగు మాత్రమే ఉంటాయి. దశాబ్దాలకాలంలో గద్దెల్లో కూడా మార్పులు జరిగినట్లు పెద్దలు గుర్తుచేస్తున్నారు.

మేడారం గద్దెల డిజైన్లో మార్పులు

రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వనదేవతల గద్దెలను సైతం ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్నట్లు వడ్డెలు (పూజారులు) ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జాతర నిర్వహణ పై జరిగిన సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ వాస్తుశిల్పి (ఆర్కిటెక్ట్‌) రాజశేఖర్‌ వనదేవతల గద్దెల కొత్త డిజైన్‌ను ప్రదర్శించారు. ఈ గద్దెలను గ్రానైట్ రాయితో, మహాజాతరకు ముందే నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల మార్పు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలు, వడ్డెల అభిప్రాయాలకు విలువనిస్తూ మాస్లర్ ప్లాన్ పనులు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రస్తుతానికి చర్చ సద్దుమణిగింది.

ఆదివాసీ సంస్కృతి ప్రకారం మేడారం అభివృద్ధి: మంత్రి సీతక్క

వనదేవతల గద్దెల నూతన డిజైన్‌ పై పూజారుల సంఘం, ఆదివాసీ సంఘాలు ఆమోదిస్తాయా? లేదా? అనే చర్చసాగుతున్న నేపథ్యంలో శనివారం మంత్రి సీతక్క సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.110 కోట్లతో మేడారం లో అభివృద్ధి ప‌నులు కొన‌సాగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్, సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్, ఆర్కిటెక్టు పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. మేడారం గద్దెల పరిసరాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ వడ్డెల సలహాలు, సూచనల ఆధారంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివాసీల విశ్వాసాలకు భంగం కలుగకూడదని తేల్చిచెప్పారు. గద్దెలు, ఎంట్రెన్స్, క్యూలైన్ల డిజైన్‌లను సిద్ధం చేసి వడ్డెల ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు వరుసలో ఉండేలా చూడాలన్నారు.ఈ మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రత్యేక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జాతర పూజారులు, పరిశోధకులు, జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులతో కూడిన కోర్ కమిటీ మాస్టర్ ప్లాన్ అమలును పర్యవేక్షిస్తుందన్నారు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తామని సీతక్క ప్రకటించారు.