చిన్న పంచాయతీలకు 5 లక్షలు.. మేజర్ పంచాయతీలకు 10 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులు : సీఎం రేవంత్‌రెడ్డి

చిన్న గ్రామపంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షల ఎస్.డీ.ఎఫ్. నిధులను కొత్త సంవత్సరంలో ఇచ్చే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇవి అదనం అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోకపోవచ్చునని, కొత్త సర్పంచుల గౌరవం నిలబెట్టేందుకే ఈ నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

  • By: TAAZ |    telangana |    Published on : Dec 24, 2025 9:26 PM IST
చిన్న పంచాయతీలకు 5 లక్షలు.. మేజర్ పంచాయతీలకు 10 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులు : సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సర్పంచ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
  • రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
  • వివక్ష చూపితే అభివృద్ధికి ఆటంకం.
  • దేశంలోనే కొడంగల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం
  • సర్పంచుల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి )
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు…ఎన్నికల తరువాత రాజకీయాలు లేవు… పార్టీలు, పంతాలు వద్దు… రాజకీయాలకు తావు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ది పై వివక్ష చూపితేఆటంకం ఏర్పడుతుందన్నారు. బుధవారం నారాయణ పేట జిల్లా కోస్గి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 182 మంది కొత్త సర్పంచులు అందరినీ సీఎం శాలువాతో సన్మానించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించాలని,దేశ పునాదులు గ్రామాల్లోనే ఉన్నాయన్నారు. ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అని,నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఎక్కువ సమయం ఇవ్వలేక పోయినా.. నియోజకవర్గ కార్యకర్తలకు స్థానికంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు అందుబాటులో ఉంటున్నారన్నారు. తెలంగాణలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంచుతానని, తాను ఎక్కడున్నా నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి గమనిస్తుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది, ఇక్కడి ప్రతి తండా కు గుడి,బడి నీళ్లు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న గ్రామపంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షల ఎస్.డీ.ఎఫ్. నిధులను కొత్త సంవత్సరంలో ఇచ్చే బాధ్యత తనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇవి అదనం అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోకపోవచ్చు… కొత్త సర్పంచుల గౌరవం నిలబెట్టేందుకే ఈ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.

2023 డిసెంబరు లో వచ్చిన ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, అధికారంలో పదేళ్లు ఉన్న కెసిఆర్ సర్కార్ ఇవ్వని రేషన్ కార్డులు రెండేళ్ల లో ఇచ్చామన్నారు.రాష్ట్రంలో 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని,. ఇంకా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇచ్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే బాధ్యత నాదన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో రేషన్ కార్డులు లేని వారి పేర్లు, ఉచిత కరెంటు రాని వారి పేర్లు, రైతు భరోసా రాని రైతుల పేర్లు ఇస్తే అర్హులైన అందరికీ ఆయా పథకాలను అందిస్తాన్నారు. బస్సుల్లో మహిళలకు కండక్టర్ బస్ చార్జీ అడిగితే నా పేరు చెప్పండని, మా అన్న సీఎం కు చెప్తామని,మీ నౌకరి ఊడుతుంది అని చెప్పండన్నారు.బస్సులో శ్రీశైలం, యాదగిరి గుట్ట, వెళ్తారో వెళ్లండి..సమ్మక్క సారక్క జాతరకు వెళ్లి దర్శనాలు చేసుకోండి…. నెలకు ఒకసారి తల్లిదండ్రులను పలకరించి రండి అని ఆయన మహిళలకు సూచించారు. కోటిమంది ఆడ బిడ్డలకు సారే పేరిట చీర ఇస్తునాం. ఇంకా ఎవరికైనా చీర అందక పోతే అందేలా చర్యలు తీసుకోవాలని సీ ఎస్. కలెక్టర్లను ఆదేశించారు.

మీ పిల్లలను పాఠశాలకు పంపించండి. చదువుతోనే వెలుగు, మార్పు వస్తుందని,ఇక్కడున్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు చిన్నచిన్న కుటుంబాలనుంచి వచ్చినవారే అయినా వాళ్లు ఉన్నత చదువులు చదువుకున్నారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, రాష్ట్ర మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టిఫిన్ మధ్యాహ్న భోజనం పెట్టి మంచి చదువు చెప్పిస్తామన్నారు. 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ను కొడంగల్ లో నిర్మిస్తామన్నారు. దేశంలో నీ ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవాలన్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేసుకుంటున్నామని, 2014లో తెచ్చిన జీవో 69 ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందని,చివరకు ఆ ప్రాజెక్టు సాధన సమితి ఏర్పాటు చేసి గొంతెత్తి నినదించిందన్నారు. ఇప్పుడు తాము ఆ ప్రాజెక్టు ను ప్రారంభించు కుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారు. మక్తల్ నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ లో ఎకరా కు రూ. 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే తాను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని, క్యాబినెట్ ఆమోదం పొందింది అని సీఎం తెలిపారు. ఇప్పుడు 96 శాతం రైతులు ఒప్పుకుని భూములు ఇస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, నారాయణపేట ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వర్, రెవెన్యూ కలెక్టర్ శ్రీను, కడా అధికారి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.