IAS Arvind Kumar | ఐఏఎస్ అర్వింద్‌పై మరో కేసు.. మాజీ హెచ్ఎండీఏ డైరెక్టర్‌పైనా..

IAS Arvind Kumar | రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) శివ బాలకృష్ణ లపై మరో అవినీతి కేసు నమోదు అయ్యింది. పుప్పాలగూడలో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ డీఎస్ఆర్ ఎస్ఎస్ఐ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కు హైరైజ్ భవనాల అనుమతులు ఇచ్చారని అడ్వకేట్ ఇమ్మనేని రామారావు తెలంగాణ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ అనుమతుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తన ఫిర్యాదులో లోకాయుక్తకు తెలిపారు.
పుప్పాలగూడలోని సర్వే నంబర్లు 227, 280, 281లో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ అనుమతులు ఇచ్చారని ఆయన వివరించారు. ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, శివ బాలకృష్ణలపై కేసు నమోదు చేశారు. పుప్పాలగూడలో ఒక్కో ఫ్లాట్ (నాలుగు బెడ్ రూమ్ లు) ధర రూ.4.59 కోట్ల నుంచి రూ.6.27 కోట్ల మధ్య ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు తెగబడి ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ అనే తేడా లేకుండా అనుమతులు, పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏసీబీ, ఈడీ కి ఫిర్యాదులు వస్తునే ఉన్నాయి.