అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ

తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయడంతో సమ్మెపై ఉత్కంఠ నెలకొంది.

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ

విధాత, హైదరాబాద్ : ఓ వైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు మంగళవారం అర్థరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నట్లుగా ప్రకటించారు. ఇంకోవైపు సమ్మెకు కొన్ని గంటల ముందు సమ్మె డిమాండ్ పరిష్కారానికి కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ మలుపు తీసుకుంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో.. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించడం ఆసక్తికరం.

టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జి.ఓ.ఎం.ఎస్.నెం.66 విడుదల చేసినట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం నలుగురు అధికారుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.

కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా,రహదారులు & భవనాల శాఖ ఛైర్మన్, మరియు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ సభ్యుడు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ సభ్యుడు, అలాగే వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ సభ్యుడు & కన్వీనర్ లు ఉన్నారు. కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు .

సమ్మె యధాతధం : ఆర్టీసీ జేఏసీ

తాము మంగళవారం అర్థరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని..ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది అని ర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నప్పటికి ప్రభుత్వం,యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారు అని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారు అని, ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే.. మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆర్టీసీ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి :

ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం