రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
రేపు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు తెరుచుకోనున్నాయి. ఎల్లుండి బద్రీనాథ్ దర్శనం ప్రారంభం కానుండగా చార్‌ధామ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది.
విధాత : హిమాలయ పర్వతాల్లోని చార్‌ధామ్ యాత్రలో గల నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పవిత్ర కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసివేసిన ఆలయాన్ని పుష్పాలంకరణ కోసం అధికారులు మొత్తం ఏకంగా 51 క్వింటాళ్ల పూలను వినియోగించి అత్యంత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కేదరేశ్వరుడి సందర్శనార్థం వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మారుమోగుతోంది. భక్తులు ఈ ఆరు నెలల కాలంలో (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు. ఆలయం లోపల మొబైల్ ఫోన్లు, కెమెరాలకు నిషేధం ఉంది.
భక్తుల రద్దీతో భారీ బందోబస్తు
ఆలయ పరిసరాల్లో (కేదార్‌నగరి) తాజా మంచు కురుస్తుండటంతో, మంచు దుప్పటిలా కనిపిస్తోంది. మంచుతో కప్పుకుపోయిన నడక మార్గాలను పూర్తిగా క్లియర్ చేశారు. భారీ సంఖ్యలో రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అమల్లోకి తెచ్చారు. యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక బృందాలు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాయి.
ఉత్సాహంగా చార్‌ధామ్ యాత్ర
ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ పవిత్ర చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది భక్తులు హిమాలయాలకు చేరుకున్నారు. రేపు (ఏప్రిల్ 22న) కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సైతం భక్తుల దర్శనార్థం తెరవనున్నారు.
ఇవి కూడా చదవండి :
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
స్థిరంగా బంగారం, వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram