తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి పెట్టుబడి సహాయం పంపిణీకి ఇంకాసేపట్లో శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికగా నిర్వహించనున్న రైతు భరోసా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తారు. తొలి రోజు మంగళవారం ఎకరానికి రూ.6వేల చొప్పున 2 ఎకరాల వరకు రూ.2,482.02 కోట్లు “రైతు భరోసా” నిధులను 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. 1 ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు జమ కానున్నాయి.
పది రోజులలో మిగిలిన రైతులందరికి కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తారు. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు దశలవారీగా మొత్తం రూ.9వేల కోట్ల మేరకు జమ కానున్నాయని ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
