రేపటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ గడువు..74లక్షల ఓట్ల కోత!

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ఎన్యుమరేషన్ గడువు సోమవారంతో ముగియ్యనుంది. సర్ తో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం...అంటే దాదాపుగా 74లక్షల ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క హైదరాాబాద్ క్యూర్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

విధాత : తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ఎన్యుమరేషన్ గడువు సోమవారంతో ముగియ్యనుంది. ఎస్​ఐఆర్​ లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఎన్యూమరేషన్​ ఫారాలను తిరిగి ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. రేపటితో ఎస్‌ఐఆర్ గడువు పూర్తవుతున్నప్పటికి ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు తమకు అందలేదని ఎలక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది.

ఈ లెక్కన సర్ తో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీరిలో మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఇప్పటివరకు డిజిటలైజేషన్ పూర్తి కానటువంటి, వివరాలు నమోదు చేయించుకోని లక్షలాది ఓటర్లు తక్షణమే తమ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రంలో 74 లక్షల ఓట్లు తగ్గే అవకాశం

తెలంగాణలో సుమారు 74 లక్షల ఓట్లకు కోత పడనున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ కోర్ అర్బన్‌(క్యూర్) పరిధిలో 40 శాతం ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు ఈసీ తెలిపింది. అయితే వారిలో 2,64,11,118 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. రేపటిలోగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారు వెంటనే సమర్పించాలని ఎన్నికల సంఘం కోరుతోంది. మిగతా 74 లక్షల మంది ఓటర్లు ఎన్యూరేషన్‌ ఫారాలు ఇవ్వకపోతే దాదాపు వారి ఓట్లు గల్లంతైనట్లేనని తెలుస్తోంది.

ఈనెల 17న ఓటర్లు ముసాయిదా జాబితాను ఈసీ ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈనెల 17 నుంచి అక్టోబరు 15 వరకు ఉంటుంది. అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

హైదరాబాద్ లో 43లక్షల ఓట్ల తొలగింపుకు ఛాన్స్

హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40 శాతం ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 58.41శాతం మేడ్చల్‌ జిల్లాలో 63.79 రంగారెడ్డి జిల్లాలో 64.82 శాతం ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి వెనక్కి ఇచ్చారు. అంటే హైదరాబాద్‌ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,66,767 మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. మేడ్చల్‌ జిల్లాలో 29,79,130 ఓటర్లు ఉండగా 19 లక్షల వరకే ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు అందాయి. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లలో 23,98,99 మందివి మాత్రమే అందాయి.

ఈ గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో 19 లక్షలు రంగారెడ్డిలో 13 లక్షలు మేడ్చల్‌ జిల్లాలో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 43 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది.

జిల్లాలలో ఎన్యూమరేషన్ మెరుగు..

తెలంగాణలోని జిల్లాల్లో సుమారు 85 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదయ్యాయి. మెదక్, సూర్యాపేట, భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో 90 శాతం ఓటర్లు ఈఎఫ్​లను వెనక్కి ఇచ్చారు. సంగారెడ్డిలో 79.16 శాతం, వికారాబాద్‌లో 79.18 శాతం, హనుమకొండలో 79.72 శాతం నమోదైంది. భువనగిరి జిల్లాల్లో సుమారు 95 శాతం ఓటర్ల వివరాలు నమోదయ్యాయి. రేపటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వకపోతే వెంటనే బీఎల్వోల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసింది.

Latest News