TGSRTC | హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం( Fish Prasadam ) పంపిణీ చేసేందుకు బత్తిని సోదరులు సిద్ధమయ్యారు. జూన్ 8, 9 తేదీల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇక చేప ప్రసాదం సేవించేందుకు హైదరాబాద్( Hyderabad ) నగరంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలిరానున్నారు. అంతేకాదు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి 124 స్పెషల్ బస్సులను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్( Nampally Exhibition Ground )కు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులు జూన్ 8, 9 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, మహాత్మా గాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 44 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
మరో 80 ఆర్టీసీ బస్సులు దిల్‌సుఖ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, గచ్చిబౌలి నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.
హెల్ప్ డెస్కులు ఏర్పాటు
చేప ప్రసాదం కోసం వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉంటాయన్నారు.
