ఎట్టకేలకు బదిలీలకు పచ్చజెండా..! ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌కు ఓకే చెప్పిన సర్కార్‌..

దాదాపు ఆరేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు మోక్షం లభించింది. ప్రభుత్వం శుక్రవారం దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. 2018లో బీఆరెస్‌ ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రమే బదిలీల ప్రక్రియ జరిగింది

ఎట్టకేలకు బదిలీలకు పచ్చజెండా..!  ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌కు ఓకే చెప్పిన సర్కార్‌..

ఆరేళ్ల తరువాత బదిలీల ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను వేర్వేరు స్టేషన్లుగా గుర్తింపు..

ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ఈ మేరకు నిర్ణయం…

బీఆరెస్‌ ప్రభుత్వంలో ఒక్కసారే బదిలీలు..

317 జీవోపై ఇంకా క్లారిటీ ఇవ్వకుండానే జీవో విడుదల.. ఈ ఉద్యోగుల బదిలీలకు ప్రయార్టీ ఇవ్వాలంటున్న సంఘాలు..

సర్కార్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు..

విధాత, హైదరాబాద్‌:దాదాపు ఆరేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు మోక్షం లభించింది. ప్రభుత్వం శుక్రవారం దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. 2018లో బీఆరెస్‌ ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రమే బదిలీల ప్రక్రియ జరిగింది. అదీ శాస్త్రీయంగా చేయకుండా రాజకీయ ఒత్తిళ్లకు మేరకు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిని జీహెచ్ఎంసీ కింద పరిగణించి బదిలీలు చేయడంతో ఇక్కడ నుంచి బయట జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. ఈ మూడు జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులంతా హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు. ఇదే అంశాన్ని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించాయి. జిల్లాల వారీగా కలెక్టరేట్లు విడిగా ఏర్పాటు చేసినందున హైదరాబాద్‌లో పనిచేసే వారు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు బదిలీపై వెళ్లేలా వేర్వేరు స్టేషన్లుగా గుర్తించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులు కలిపి మొత్తం 2, 50,000 మంది వరకు ఉండగా.. ఇందులో 40 శాతం మేర బదిలీలు చేయనున్నారు. దాదాపు 80 వేల మంది ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. కాగా జీవో 317 పై ఇంకా క్లారిటీ లేకుండా బదిలీల ప్రక్రియ కొనసాగడం వల్ల దాదాపు మూడు వేల మంది ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికీ దీనిపై ఓ కమిటీ వేసి చర్చించినా పూర్తిస్తాయిలో పరిష్కారాలు కొలిక్కిరాలేదు. స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌.. విభాగాలకు చెందిన ఉద్యోగుల బదిలీల్లో కొన్ని సమస్యలున్నాయి. అందుకే వీరి విషయంలో ప్రయార్టీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. డీఏ, పీఆర్సీ తదితర అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోయినా.. బదిలీల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకున్నందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.