తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ

  • Publish Date - October 8, 2023 / 06:43 AM IST

విధాత, పెద్దపల్లి: సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డీ శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ‘గత నెల 27న సమావేశం ఏర్పాటు చేస్తే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదు. తుది ఓటరు జాబితాను కూడా సంస్థ ప్రకటించలేదు.


కోర్టు ఆదేశాలతో అక్టోబరు 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశాం. సింగరేణి యాజమాన్యం సహాయ నిరాకరణ వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నాం’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.


అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ీ తీర్పును నిలిపివేయాలని డివిజన్ బెంచును సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ, సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది.