కాళేశ్వరం కుంగినట్లుగా కేసీఆర్ ప్రభుత్వం కూలబోతుంది: కోదండరామ్

విధాత : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అన్యానికి గురయ్యాయని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లుగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలబోతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి అధికారంలోకి రాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలు తుంగలో తొక్కబడ్డాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం అధికంగా ఉందని బిశ్వాల్ కమిటీ నివేదిక వెల్లడించిందన్నారు.
బలిదానాలతో సాధించి తెచ్చుకున్న తెలంగాణలో మాటల గారడితో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆదాయం తప్ప తెలంగాణలో ప్రజలకు, నిరుద్యోగులకు దక్కిందేమి లేదన్నారు. కమిషన్ల కక్కుర్తి తో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన మూడేళ్లు పూర్తిగా కాకముందే మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి అవినీతికి నిదర్శనం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల తిప్పిపోతలే తప్ప ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేసేందుకు కేసిఆర్ కు సమయం లేదన్నారు. పేపర్ల లీకేజీతో నిరుద్యోగులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. కేసీఆర్ విచ్చలవిడి లిక్కర్ అమ్మకాలతో యువతను తాగుబోతులను చేస్తున్నాడన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాల్లో కోట్ల అవినీతి జరిగిందని, మళ్లీ కేసీఆర్‌ను గెలిపిస్తే రాష్ట్రం కోలుకోవడం కష్టమవుతుందని, ప్రజాస్వామ్య పాలన దూరం అవుతుందన్నారు.