గోవులను కాపాడిన మహిళలకు కేంద్ర మంత్రి బండి సన్మానం మీ పోరాటం… అందరికీ స్పూర్తిదాయమని కితాబు
గోమాతలను కబేళాకు తరలిస్తున్న మూకలను వీరోచితంగా అడ్డుకుని పోలీసులకు పట్టిచ్చిన మహిళలు మైథిలీ, సునీతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు.
విధాత, హైదరాబాద్ : గోమాతలను కబేళాకు తరలిస్తున్న మూకలను వీరోచితంగా అడ్డుకుని పోలీసులకు పట్టిచ్చిన మహిళలు మైథిలీ, సునీతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. ‘‘వీర వనితలూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా గోవులను కాపాడిన మీకు హ్యాట్సాఫ్’’అంటూ కితాబిచ్చారు. జూన్ 15న ఓల్డ్ మలక్ పేటలోని రెండు వాహనాల్లో గోమాతలను తరలిస్తుండగా ఈ మహిళలు ఆ రెండు వాహనాలపైకి ఎక్కి అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 200 మంది మూకలు వారిని బూతులు తిడుతూ దాడి చేసేందుకు యత్నిస్తూ భయబ్రాంతులకు గురిచేసినా భయపడకుండా పోలీసులు వచ్చేదాకా ఆ వాహనాలను ఆపడం, ఈ సంఘటనను కొందరు వీడియో తీయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ వారితో ఫోన్ లో మాట్లాడి కుటుంబ సభ్యులతో కలిసి హిమాయత్ నగర్ కు రావాలని కోరారు. వారు వచ్చాక శాలువా కప్పి ‘ మీ పోరాటం భేష్’ అంటూ సత్కరించారు. మీ ధైర్యం, సాహసం ఇతర మహిళలతోపాటు యువత అందరికీ అదర్శం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చట్టపరిధిలో గోమాతలను రక్షించడం అభినందనీయం’అని పేర్కొన్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ వారి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన ఈ మహిళలు ప్రస్తుతం మలక్ పేటలో నివసిస్తన్నారు. వీరి కుటుంబం ప్రక్రుతి వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతు అవార్డులను కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా వనిత మైథిలీ మాట్లాడుతూ ‘‘దేశంతోపాటు విశ్వమంతా బాగుండాలంటే గోజాతి సురక్షితంగా ఉండాల్సిందే. గోమాతలకు హానీ చేస్తే మనకు మనం హానీ చేసుకున్నట్లే. ఈ ఉద్దేశంతోనే తాము గోవులను కబేళాకు తరలిస్తున్న విషయం తెలుసుకుని అడ్డుకున్నాం’ అని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram