Velichala Rajender Rao | నేటి నుంచి “వెలిచాల” ప్రచారం

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గురువారం నుంచి తనఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

  • By: Somu |    telangana |    Published on : Apr 25, 2024 11:40 AM IST
Velichala Rajender Rao | నేటి నుంచి “వెలిచాల” ప్రచారం

పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్,
డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి,
హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ ప్రణవ్

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గురువారం నుంచి తనఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం నుండి ఆయన కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు.ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ తోపాటు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొననున్నారు.

తొలుత బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి హాజరై శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేపడతారు. కరీంనగర్ లోకసభ పరిధిలో నేటి నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు.

జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ఐదు న్యాయాలు యువ న్యాయం, మహిళా న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయంతోపాటు 25 గ్యారంటీ హామీలను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రచార రథాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఆట,పాటలతో ప్రచారాలు నిర్వహించేందుకు కళాకారులను ఎంపిక చేసి ప్రచార రథానికో కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి గురువారం ఉదయం 7 గంటలకు మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్, 9 గంటలకు మానకొండూర్, 11 గంటలకు శంకరపట్నం మండలాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 3 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో, 5 గంటలకు ఇల్లందకుంట, 7 గంటలకు జమ్మికుంట మండలాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.