విద్యాసంస్థల బంద్ విజయవంతం

విధాత : విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థి సంఘాల పిలుపును అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు బంద్ కు సహకరించడంతో తరగతుల నిర్వహణ సాగలేదు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ, ఎస్ఎఫ్ఐ, ఎఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డీఈవో, డీఐఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ విద్యాసంస్థలకు నూతన భవనాలు నిర్మించాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడి బ్రాంచీలకు అనుమతి ఇవ్వరాదని, పెండింగ్ కాస్మోటిక్ చార్జీలను, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను, ఎయిడెడ్ పాఠశాలల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులలో ఆశాస్త్రీయంగా తీసుకొచ్చిన సమయపాలనను మార్చాలన్నారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, సంవత్సరాల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న డీఈవో, డీఐవోలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.