విధాత : వరంగల్ కోట పూర్వ వైభవం ఆవిష్కరణ పయత్నాల ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చేపట్టిన కందకాల(అగడ్తలను)ను పునరుద్ధరించే ‘మోటు’ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. భావి తరాలకు అవగాహన కల్పించేలా కాకతీయ వంశం నాటి కోట రక్షణ వ్యవస్థలోని కందకాలను (అగడ్తలను) పునరుద్ధరించడంలో భాగంగా కందకం తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాతి, మట్టి కోటల మధ్య కందకాలు పునరుద్దరించి, స్థలాలు చదును చేసి..వరదనీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన పనులు నిర్వహిస్తున్నారు. ఖిలా వరంగల్ కోటకు వచ్చే పర్యాటకులు కందకాల నీటిలో పడవ(బోటింగ్ షికారు) ప్రయాణం చేసేలా ప్రతిపాదించారు. భద్రకాళి బండ్‌కు అదనంగా..ఖిలా వరంగల్ గుండు చెరువు, శృంగారపు బావి పరిసరాలను అభివృద్ది చేయబోతున్నారు.
వరంగల్ కోట నిర్మాణం ప్రత్యేకతలు
కోటలు నాలుగు రకాలు. అవి స్థల, జల, గిరి, వన దుర్గంలు. వరంగల్ కోట స్థల దుర్గం. ఇది దక్షిణ భారతదేశ వాస్తు శిల్పకళకు గొప్ప తార్కాణం. వరంగల్ కోట మూడు ఏకకేంద్రక వృత్తాకార రక్షణ గోడలతో నిర్మించబడింది. రుద్రమ దేవి పాలనలో నిర్మించిన మొదటి రక్షణ గోడ నిర్మాణం 1.5 మైళ్ళ (2.4 కి.మీ.) వ్యాసం కలిగిన మట్టి కట్ట రూపంలో ఉండేది. దీన్ని ధరణి కోట అని పిలుస్తారు.ఈ గోడ చుట్టూ సుమారు 150 అడుగుల (46 మీ) వెడల్పు గల కందకం తవ్వబడింది. దీనిలో ఎప్పుడూ10 అడుగుల మేర నీటిని నింపి ఉంచేవారు. ఇందులో మొసళ్లను, విషసర్పాలను వదిలేవారు. ఈ కోట నిర్మాణంను గణపతి దేవుడు క్రీ.శ.1199లో ప్రారంభిస్తే, ఆయన వారసురాలు అయిన రాణి రుద్రమదేవి పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
మట్టి గోడ , కందకం తర్వాత కోటను రక్షించడానికి నిర్మించిన మరో గోడ రాతి గోడ. సుమారు 0.75 మైళ్ళ (1.21 కి.మీ.) వ్యాసం కలిగిన బలమైన లోపలి రాతి గోడను భారీ గ్రానైట్ రాతి దిమ్మెలతో ఎలాంటి సున్నం వాడకుండా నిర్మించారు.రాతి కోటకు నాలుగు వైపులా పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు లేక కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు. ఈ కళాతోరణాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారిక చిహ్నంగా ప్రకటించింది.
మూడవ రక్షణ గోడ 12.5 కిలోమీటర్ల (7.8 మైళ్ళు) వ్యాసం కలిగిన మట్టి గోడ రూపంలో ఉంది. ఇది ప్రస్తుత వరంగల్ నగరాన్ని చుట్టుముట్టి ఉంది. వరంగల్ కోటకు ఏడు ప్రాకారాలు ఉన్నట్లుగా చెబుతారు. వాటినే కోటలుగా పిలుస్తారు.ఇప్పుడున్న చారిత్రక ఆధారాల ప్రకారం మూడు ప్రాకారాలు మాత్రమే కనబడుతున్నాయి.
Proposed development at Warangal Fort Moat….. restoring Kakatiya Dynasty war fare protection channels/Moat…for the future generations to understand…@Collector_HNK @Collector_WGL @INC_Ponguleti @iamkondasurekha pic.twitter.com/uAAIg6KL0r
— Venkatram Reddy Engala (@EVenkatReddy) June 14, 2026
