Warangal : రంగలీల మైదానంలో అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు
వరంగల్ రంగలీల మైదానంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 70 అడుగుల రావణ ప్రతిమ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరం ఉర్సు రంగాలీలా మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. వేలాది మంది ప్రజలు హాజరై వేడుకలను తిలకించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరైన శాసనమండలి ఉపాసభాపతి బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డిసిపి సలిమాలతో కలసి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆటోమెటిక్ స్విచ్ ఆన్ చేసి రావణ వధ, దసరా వేడుకలను ప్రారంభించారు.
పది తలలతో కూడిన 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. మిరుమిట్లు గొలుపే వెలుగుల్లో బాణసంచా పేలుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అంతకుముందు కరీమాబాద్ రామస్వామి గుడి నుండి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాలను రథంపై ప్రతిష్టించి వేలాది మంది వెంటరాగా, కోలాటం డప్పు చప్పుళ్ళు, వాయిద్యాలు భజనలు నృత్యాల నడుమ రంగలీల మైదానికి చేరుకున్నారు. అనంతరం షమీ పూజ, పాలపిట్ట దర్శనం నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వేడుకల్లో పేరిణి శివతాండవం, కూచిపూడి నృత్యాలు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, రాణిరుద్రమ్మ, జానపద గేయాలు తెలంగాణ ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతి యువకులు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగితేలారు. చెడుపై విజయం సాధించిన రోజునే ప్రజలు విజయదశమిగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోందని మంత్రి కొండ సురేఖ అన్నారు.
రంగలీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉర్సుతోపాటు రంగశాయిపేట, కొత్తవాడ, తోట మైదానం ఆప్రాంతాలలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వర్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, జలగం అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, జిడబ్ల్యూఎంసీ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram