Meenakshi Natarajan | తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ముద్ర ఎక్కడా కనిపించడంలేదనే చర్చ అంతర్గతంగా సాగుతోంది.

కాంగ్రెస్ ఇంచార్జికి ఢిల్లీ కల్లెం

పార్టీ నేతలకు తగ్గిన ప్రాధాన్యం

విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ముద్ర ఎక్కడా కనిపించడంలేదనే చర్చ అంతర్గతంగా సాగుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తూ, కేడర్ లో నిరంతరం విశ్వాసాన్ని నింపుతూ, ప్రభుత్వానికి పార్టీ నుంచి తగిన సూచనలు, సలహాలు అందిస్తూ ఢిల్లీ నాయకత్వానికి కళ్ళూ, చెవులుగా పనిచేసే ‘ఇంచార్జ్’ పాత్ర ఇక్కడ కనుమరుగైందనే వాదన పార్టీలో ప్రారంభమైంది.

అధికారంలో ఉన్న తెలంగాణలో రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకం సందర్భంగా పార్టీలో ఎంతో చర్చ సాగింది. ఆమె రాకతో పార్టీకి ప్రాధాన్యత, పనిచేసే కేడర్కు మంచి అవకాశాలు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు బంగారు భవిష్యత్తు అన్నట్లుగా వివిధ అంశాల పై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఆమె రాకతో తెలంగాణలో అధికారంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం రెండు మూడు టర్మలు కొనసాగుతోందంటూ పార్టీ దశ, దిశ మారుతోందని చెబుతూ వచ్చారు.

రానున్న రోజుల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రభుత్వంలో, పార్టీలో పెద్ద పీట వేస్తారని, గుర్తింపు లభిస్తోందని ఆశించారు. విద్యార్ధి సంఘ స్థాయి నుంచి ప్రారంభమై పార్టీలో ఎఐసీసీ స్థాయి నేతగా మీనాక్షి ఎదిగారని, రాహుల్ కోటరీలో భాగస్వామ్యమైన నేతగా గుర్తింపు పొందారంటూ రకరకాలుగా ఆమె పై అంచనాలు పెంచేశారు. ఈ మేరకు దాస్ మున్సీ స్థానంలో 2025 ఫిబ్రవరిలో ఆమెను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించారు.

ఏడాది పూర్తయినా ఏదీ ముద్ర?

రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతల్లో మీనాక్షికి ఇప్పటికే ఏడాది కాలం పూర్తయ్యింది. అయినా… ఆమె ముద్ర కనిపించడంలేదనే చర్చ తాజాగా సాగుతోంది. మీనాక్షి ఉండాల్సినంత వేగంగా వ్యవహరించకపోవడానికి ఆమె పని తీరే కారణమా? ఢిల్లీ పెద్దల నుంచి పార్టీ ఏమైనా కల్లెం వేస్తున్నారా? అనే భిన్న చర్చ కూడా ఇటీవల సాగుతోంది. ఆమె నామమాత్రంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారనే ఇంకో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాల పై ఇంచార్జ్గా రాజకీయ విమర్శలను కూడా పెద్దగా కొనసాగించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా పదవులు పొందిన కొందరు ముఖ్యనేతలు, ప్రభుత్వంలో బాధ్యతలు లేనటువంటి పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ప్రేక్షపాత్రవహిస్తున్నా ‘సమన్వయం’ చేయడమో? వారిని దారిలో పెట్టడమో? ఎందుకు చేయడంలేదంటున్నారు. పార్టీ, ప్రభుత్వం కలిసి అడుగేస్తే మరోసారి అధికారం చేజిక్కించుకునే అవకాశముంటుందంటున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యత ఇంచార్జ్ గా మీనాక్షిదే కదా? అంటున్నారు.

కాంగ్రెస్ లో పవర్ సెంటర్

కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అంటే కాంగ్రెస్ లో ఒక విధంగా పవర్ సెంటర్ లాంటిది. అధికారంలో ఉన్న నేతలు ఈ పవర్ సెంటర్ కు ఒకింత భయంతో కూడిన గౌరవాన్ని ఇస్తుంటారు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్గా దీపాదాస్ మున్షీ బాధ్యతలు నిర్వహించారు. మున్సీ పని తీరు పై భిన్నాభిప్రాయాలు, విమర్శలు వ్యక్తం కావడంతో ఆమె స్థానంలో మీనాక్షికి అప్పగించారు. ఇంచార్జ్ అంటే ఢిల్లీ నాయకత్వానికి, రాష్ట్ర పార్టీకి సమన్వయకర్తగానే కాకుండా రాష్ట్రంలో పార్టీ పై పట్టును కొనసాగించే కీలక పాత్రగా భావిస్తారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు తెలంగాణలో నామ మాత్రంగా మారాయంటున్నారు.

రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల పై ఎప్పటికప్పుడు పార్టీ వైఖరిని వెల్లడిస్తూ అధికారంలో ఉంటే విపక్షాల విమర్శలకు చెక్పెడుతూ విపక్షంలో ఉంటే అధికార పార్టీ పై నిప్పులు చెరుగుతూ నిజమైన బాధ్యతలు నిర్వహించాల్సిన మీనాక్షి ఎందుకో తెరముందూ కనిపించడంలేదనీ, తెరవెనుక ఆమె ఏ పాత్ర నిర్వహిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే ఆమె అంతర్గతంగా పార్టీ నిర్మాణం పై కేంద్రీకరించారని చెబుతున్నారు. సంఘటన అభియాన్ పై దృష్టి పెట్టారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆమె పూర్తిగా గాంధీ భవన్ కే పరిమితయ్యారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు పై పార్టీ ఢిల్లీ నాయకత్వం సానుకూలంగా ఉన్నందున ఇంచార్జ్ పాత్ర పై పెద్దగా భారం లేదంటున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వ సూచనల మేరకే అడుగులు వేస్తున్నందున పార్టీగా జోక్యం చేసుకోవాల్సిన సందర్భం తక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, అంతకు ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కేడర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు.

పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఇంచార్జ్ లపైన్నే ఉంటోందని అంటున్నారు. పార్టీ పునాదులు విస్తరిస్తరించకపోతే రానున్న కాలంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటున్నారు. అధికార మత్తులో మునిగిపోయి పార్టీ కేడర్ ను , నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తే పుట్టిమునిగకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో కొంత నిస్తేజం నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీని గాఢీలో పెట్టి, నిర్మాణాత్మకంగా బలోపేతం పై దృష్టిపెట్టకుంటే అధికార మత్తు అందరినీ ఆవరిస్తోందని అంటున్నారు.!!!

Read More:

బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !

కేసీఆర్ పై కవిత మరోసారి విమర్శలు

Latest News