తెలంగాణలో కౌలు రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామన్న హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ పౌరులు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు, ప్రజానాయకులతో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. సాధన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సీనియర్ రాజకీయ ఉద్యమకారుడు, రైతు ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కౌలు రైతుల సమస్యలపై 2023 సెప్టెంబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో నేను పీపుల్స్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నాను. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కౌలు రైతులను గుర్తించని పట్టుదల వైఖరి కారణంగా వారు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను మేము విన్నాము. 2011 చట్టాన్ని అమలు చేయాలన్నదే అప్పట్లో పెద్ద డిమాండ్. 2023 సెప్టెంబర్ 13న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు బహిరంగ లేఖ రాసి గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాదాపు 3 ఏళ్లు గడిచినా కౌలు రైతులు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారని వినడానికి విచారిస్తున్నాను.
తెలంగాణలో ప్రగతిశీలంగా పనిచేసే వ్యక్తులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. కౌలు రైతుల సమస్య కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ డీ. నర్సింహారెడ్డి కానీ, కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ తయారు చేసిన రిపోర్టు దేశంలోని రైతులందరికీ మేలు చేసేవిధంగా ఉంది. నేను ప్రధానంగా మూడు అంశాలను ప్రస్థావించాలనుకుంటున్నాను. అవి ఏంటంటే నైతిక అంశం, విధానపరమైన అంశం, చివరిది రాజకీయపరమైన అశం. నైతికత విషయానికి వస్తే నన్ను నేను ఉదహారణకు తీసుకుంటాను, నేను హర్యానకు చెందినవాడిని, ఢిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉంటుంది. అక్కడ నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది, దాంట్లో రెండు ఎకరాల భూమిని పిల్లలు ఆడుకునేందుకు స్టేడియం నిర్మించాము, మిగతా రెండు ఎకరాల భూమి ఇప్పటికీ నా పేరు మీదనే ఉంది. అయితే నేను ఏ రోజు వ్యవసాయం చేసిన వాడిని కాదు, ముప్పై నలభై సంవత్సరాలుగా మా కుంటుంబంతో దగ్గరి సంబంధం ఉన్నవ్యక్తికి కౌలుకి ఇచ్చాము. ఇప్పటికీ ఆ భూమివి వారే సాగు చేస్తున్నారు. వర్షాలు పడి నష్టం వస్తే అతను భరించాలి, పంట బాగా పండితే మాత్రం మాకు ఇవ్వాలి, వీటితోపాటు ప్రభుత్వ అందించే సహాయం కూడా మాకే లభిస్తాయి కానీ అతనికి ఏమి దొరకదు, ఇది ఏవిధంగా న్యాయం అవుతుంది. అందుకే మా నాన్న సాగు చేస్తున్న సమయంలో నష్టం వస్తే అతనే భరిస్తున్నాడు కాబట్టి ఆ పంటపై ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వం అందిస్తే అవి అతనికే చెందాలని నిర్ణయించారు. కానీ సమాజంలో అందరూ ఇలా చేయట్లేదు.
కౌలుదారుడు పెట్టుబడి పెట్టి భూమి నుంచి పంటను తీస్తాడు. కాబట్టి వ్యవసాయం అనేది ఒక వ్యాపారమో, దందాలాంటిదో కాదు, ఈ దేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటిది. అలాంటి రైతుల కోసం ప్రభుత్వాలు ఏవైనా పథకాలు తీసుకువస్తే అది తన శక్తినంతా భూమిపై పెట్టి, రిస్క్ అంతా తన తలపై పెట్టుకుని పంట పండిస్తున్న వ్యక్తికి దక్కాలి కానీ, పట్టాదారులకు కాదు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు భూమి నుంచి కష్టపడి పంటను పండించేవాడు నిజమైన రైతు. భూమి తన పేర పట్టా ఉంటే రైతు ఎలా అవుతాడు, భూ యజమాని అవుతాడు. కాబట్టి రైతు ఎవరు అనే విషయాన్ని నిర్వచనంగా పెట్టుకున్నప్పుడే మనం కౌలు రైతుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో సరైన స్పష్టత వస్తుంది.
విధాన పరమైన అంశం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఓ సమస్య ఉంది, అదేంటంటే కౌలు రైతుకి హక్కులు తీసుకురావాలంటే అతనిని గుర్తించడం ఎలా?. కౌలు రైతుకు హక్కు తీసుకురావాలనగానే పట్టాదార్లు వెంటనే భయపడతారు, కాగితం మీద కౌలు చేసుకునేవాడి పేరు ఉంటే మన భూమి పోతుందేమోనన్న భయం కొత్తదేమీ కాదు, గతం నుంచే ఉంది. అయితే 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల కోసం మంచి చట్టం తీసుకువచ్చారు. అదేంటంటే.. కౌలు రైతుకు, భూ యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు, భూస్వామి తన భూమిని ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు, తన భూమిని మర్టిగేజ్ పెట్టి రుణం తీసుకోవచ్చు తన భూమిపై హక్కు తనకు ఎప్పుడైనా ఉంటుంది, అలాగే కౌలు రైతుకు కూడా కొన్ని హక్కులు తీసుకువచ్చారు, ఆ భూమిలో పంట పండించినప్పుడు నష్టం వస్తే నష్ట పరిహారం కౌలు రైతుకు చెందాలని, ఎరువుల విషయంలో కూడా తనకే హక్కు ఉండేలా, అలాగే పంటలపై లభించే సబ్సిడీ కూడా కౌలు రైతులకే చెందేవిధంగా హక్కులు కల్పించారు. ఈ విషయాన్ని నేను తొలిసారి విన్నప్పుడు హర్యానాలో కూడా ఎందుకు ఇలా చేయకూడదని ప్రశ్నించాను, ఏపీనీ చూసి మనం నేర్చుకోవాలని అక్కడ చెప్పాను, కానీ రాను రాను ఇక్కడ ఆ చట్టాన్ని అమలు చేసే విధానమే లేకుండా పోయింది. అసలు సమస్య కౌలు రైతులను గుర్తించడంలో లేదు, దాన్ని అమలు చేసేవిధానంలో కూడా లేదు, కేవలం అధికారం ఎవరి చేతుల్లో ఉందో వారి దగ్గర ఉంది.
ఇక చివరగా రాజకీయపరమైన అంశానికి వస్తే.. నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు. ఇక్కడున్న వాళ్లు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించనవాళ్లే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసి, జైల్లకు వెళ్లి, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నవాళ్లే, కానీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారు, ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి వేరే అవకాశం లేక కాంగ్రెస్ పార్టీకి కొందరు మద్దతు ఇచ్చారు, కొందరు ఓటు వేయమని ప్రచారం కూడా చేశారు. ఇదంతా కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, కేవలం గత ప్రభుత్వాలను దించడం కోసం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడున్నవాళ్లంతా వ్యతిరేకిస్తున్నారు. వేదిక మీద ఉన్న ఆకునూరి మురళికి ఉద్యోగం ఇస్తే అతను ఆ ఉద్యోగం మధ్యలోనే వదిలేశారు, అలాగే కోదండ రాం గారు ఎక్కడికైనా వెళ్తే చాలా మంది యువత ఆయనను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రికి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను, తాను స్వయంగా లేఖలో కౌలు రైతులకు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చమని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత. త్వరలో అమలు చేయకపోతే, కౌలు రైతులు ధర్నా చేపట్టినత్తయితే, మళ్ళీ వచ్చి నా మద్దతు తెలుపుతానని ప్రకటించారు. కౌలు రైతుల హక్కులను పోరాడి సాధించుకుందాం, ఇది కేవలం తెలంగాణలో ఉన్న 22 లక్షల మంది కౌలు రైతుల సమస్యమాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి కౌలు రైతు సమస్య’’. అని అన్నారు.
ఈ సమావేశానికి వచ్చిన కౌలు రైతులు తమ దీనస్థితిని వివరించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ ఆరంభంలో సబ్సిడీ యూరియా నుంచి మొదలుకొని సీజన్ ముగింపులో కొనుగోలు కేంద్రాల ద్వారా పంట విక్రయం వరకు ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్నీ పొందలేకపోతున్నామని, భూ యజమాని OTP ఇవ్వాల్సి వచ్చే యాప్, OTP ఆధారిత విధానాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు భూ యజమానులు మాత్రమే సహకరిస్తున్నారు. 2011 సాగుదార్ల చట్టం ప్రకారం తమకు సాగుదార్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ సమావేశంలో ప్రొఫెసర్ జి. హరగోపాల్, ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనూరి మురళి (రిటైర్డ్ ఐఏఎస్), జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.సుకుమార్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
