GHMC Vs Chiranjeevi | జీహెచ్​ఎంసీని కోర్టుకీడ్చిన మెగాస్టార్​ చిరంజీవి

2002లో అనుమతులతో నిర్మించిన ఇంటిని సుందరీకరణ చేసేందుకు GHMCకు దరఖాస్తు చేసిన చిరంజీవి, సరైన స్పందన లేకపోవడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. GHMC కార్యాచరణపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు చిరంజీవి ఇంటి రెనోవేషన్ పనులకు అనుమతులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

GHMC Vs Chiranjeevi | జీహెచ్​ఎంసీని కోర్టుకీడ్చిన మెగాస్టార్​ చిరంజీవి

Adharva / Hyderabad News / 16 July 2025
GHMC Vs Chiranjeevi | హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇటీవల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రిటెయినింగ్​ గోడ నిర్మించారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC)కి జూన్ 5న అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, జిహెచ్​ఎంసీ అధికారులు ఆ దరఖాస్తుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. నెల రోజుల పాటు పలుమార్లు సంప్రదించినా సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చిరంజీవి చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిరంజీవి తరఫు న్యాయవాది వివరించిన ప్రకారం, ఇప్పటికే 2002లో ఈ ఇంటిని G+2గా అన్ని అనుమతులతో నిర్మించారు. పునరుద్ధరణలో భాగంగా మరింత జాగ్రత్తగా అదనపు అనుమతులు కూడా తీసుకున్నప్పటికీ, GHMC అధికారుల నుంచి స్పందన లేకపోవడం, తన దరఖాస్తును పరిశీలించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. హైకోర్టులో కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీ. విజయ్‌సేన్ రెడ్డి, GHMC తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ — “అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నట్లు అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. క్రమబద్ధమైన పనులకు మాత్రం ఆలస్యం ఎందుకు?” అని ప్రశ్నించారు. చిరంజీవి దరఖాస్తుపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను GHMCకి జారీ చేశారు. దీనితోపాటు, ప్రజలకు, ప్రముఖులకు సమాన న్యాయం అందించాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారం అధికారుల పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. సాధారణ పౌరుడైతే నెలల తరబడి భవన అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్‌కి కూడా అదే అనుభవం ఎదురైందంటే, జిహెచ్​ఎంసీలో అలసత్వం ఎంత లోతుగా పాతుకుపోయివుందో స్పష్టమవుతుంది. చిరంజీవి తరఫు న్యాయవాది పేర్కొన్న విధంగా, సమయానికి స్పందించకపోవడం వల్లే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఘటన మెట్రో నగరాల్లో మునిసిపల్ పరిపాలనలో పారదర్శకత, సమర్థత ఎంత అవసరమో మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. చిరంజీవి విషయం కాబట్టి ఈ సమస్య వెలుగులోకి వచ్చినా, రోజూ వేల మంది సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కావచ్చు. కోర్టు తీర్పు వెలువడిన తరువాత GHMC స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.