Jubilee Hills By poll | జూబ్లీ ‘హిల్‌ టాస్క్‌’.. మరో ఆరు నెలల్లో ఉప ఎన్నిక.. అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం

పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎవరికి వారు సీక్రెట్ గా సర్వేలు చేయించుకుని ఓటర్ల నాడి పట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లు కూడా సర్వేలు చేయిస్తున్నాయి. అభ్యర్థుల పేర్లతో, ప్రభుత్వ పథకాలు, పార్టీ పేరుతో సర్వేలు చేయించుకుని ఎప్పటికప్పుడు అంచనాకు వస్తున్నారు.

Jubilee Hills By poll | జూబ్లీ ‘హిల్‌ టాస్క్‌’.. మరో ఆరు నెలల్లో ఉప ఎన్నిక.. అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం

Jubilee Hills By poll | హైదరాబాద్, జూన్ 29 (విధాత) : నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మరో ఆరు నెలల్లో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి నేపథ్యంలో ఈ ఖాళీ ఏర్పడింది. ఉప ఎన్నిక షెడ్యూలు ఏ క్షణంలో విడుదల చేసినా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. తమకంటే తమకే సీటు దక్కుతుందని ముఖ్య నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పోటీ ప్రధానంగా మూడు పార్టీలు.. బీఆరెస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ఉండనున్నట్లు స్థానిక పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సమీప ప్రత్యర్థి మహ్మద్ అజారుద్దీన్ పై 16,337 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. గోపీనాథ్ కు 80,549 ఓట్లు, అజారుద్దీన్ కు 64,212, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి ఎం డీ రషీద్ ఫరాజుద్దీన్‌కు 7,848 ఓట్లు రాగా స్వతంత్రంగా పోటీ చేసిన వారికి వేయి కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 1,374 ఓట్లు రావడం గమనార్హం. గోపీనాథ్ వరుసగా మూడోసారి విజయం సాధించి తన పట్టును నిలుపుకొన్నారు. తొలిసారి 2014లో టీడీపీ నుంచి రంగంలోకి దిగి విజయం సాధించి, ఆ తరువాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని వరుసగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తన పట్టును పెంచుకున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నెల అకాల మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం గోపీనాథ్ కుటుంబం వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటంపై మాజీ మంత్రి పీ జనార్ధన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొంది పట్టు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సహకారంతో సీటు కైవసం చేసుకోవాలనే వ్యూహాలను రచిస్తున్నారు. గోపీనాథ్ భార్యకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ దాదాపు సుముఖంగానే ఉంది. ఉప ఎన్నికల నాటికి పార్టీ నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తే మరొకరి పేరు తెరమీదికి వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా గెలవాలనే తలంపుతో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారీగా గోపీనాథ్ సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

మళ్లీ పోటీకి అజార్‌ సై

కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలయిన మహ్మద్ అజారుద్ధీన్ మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చానని, తనకే ఇవ్వాలని ఆయన పార్టీ ముఖ్య నేతలను కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడంతో టికెట్ తనకే దక్కుతుందనే గంపెడాశతో ఉన్నారు. ఈయనకు పోటీగా మరో ముస్లిం నాయకుడు తెరమీదికి వచ్చాడు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ వైస్ చైర్మన్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటం ఈయనకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఖురేషీకి టికెట్ ఇస్తే ఓటర్లు స్వీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఖైరతాబాద్ కార్పొరేటర్, మాజీ మంత్రి పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి పోటీకి సిద్ధమనే విధంగా సంకేతాలు పంపుతున్నారు. తన తండ్రి ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందారని, తనకు టికెట్ ఇస్తే గెలుపొంది చూపిస్తానని ముఖ్య నాయకులతో చెబుతున్నారు. పీజేఆర్ పై ఉన్న గౌరవంతో ఈమె వైపు ఓటర్లు మొగ్గుచూపే అవకాశాలను తోసిపుచ్చలేము. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సీ రోహిన్ రెడ్డి కూడా రంగంలో ఉన్నారు. ఈయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మాజీ మంత్రి కే.జానారెడ్డి సమీప బంధువు కావడం, వివాదరహితంగా ఉండే నాయకుడిగా ఉండడం కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, అంబర్ పేట నుంచి రోహిన్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

జనసేన నిర్ణయాత్మక శక్తి?

బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీకి దిగిన లంకల దీపక్ రెడ్డితో పలువురు పోటీలో ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ అంత ఈజీగా టికెట్ ను పరిస్థితిలో లేదు. టీడీపీతో పాటు జనసేన ఓట్లు ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో పొత్తులు లేకపోవడంతో ఈ రెండు పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ కు ఓట్లేశారు. అయితే ఈసారి అలా ఉండకపోవచ్చని, బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా టీడీపీ, జనసేన ఓటర్లు జైకొట్టనున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి లేరని, ఈసారి కూటమి పార్టీలు బలపర్చిన అభ్యర్థికే ఓటు వేస్తామని ఒక ఓటరు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ గెలుపొంది గ్రేటర్ లో పట్టు పెంచుకున్నది. ఇదే తరహాలో జూబ్లీహిల్స్ లో గెలుపొంది పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ గౌడ్ ఉన్నారు. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, కుల సమీకరణలు ఏంటనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా అడిగితే ఇస్తానని, తనవంతుగా గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు.

బీజేపీ అభ్యర్థిని బట్టి కాంగ్రెస్‌, బీఆరెస్‌ విజయావకాశాలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3.87 లక్షల ఓటర్లు ఉన్నారు. ప్రధాన పోటీ రెండు ప్రధాన పార్టీల మధ్యే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఏపీలోని కూటమి పొత్తు కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ నిల్చోబెట్టే అభ్యర్థిని బట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలిస్తే తమ బలం మళ్లీ పెరిగిందని ప్రచారం చేసుకునేందుకు అవకాశం కలిసి వస్తుంది. కాంగ్రెస్ విజయం సాధిస్తే అదనంగా ఒక సీటుతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పడుతుంది. బీజేపీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తో అమీతుమీకి సిద్ధంగా ఉంది. అదను దొరికినప్పుడల్లా సంక్షేమ పథకాల అమలులో విఫలమవుతున్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండగా, ఎన్నికల నాటికి అభ్యర్థులను బట్టి బలాబలాలు మారే అవకాశం ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంఐఎం మద్ధతుతో కాంగ్రెస్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ అంతర్గతంగా మద్ధతు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అంతర్గతంగా ఎంఐఎం సహకరించే పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నివేదికలతో పాటు ఎంఐఎం సూచనను కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవచ్చని ఒక కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. అయితే పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎవరికి వారు సీక్రెట్ గా సర్వేలు చేయించుకుని ఓటర్ల నాడి పట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లు కూడా సర్వేలు చేయిస్తున్నాయి. అభ్యర్థుల పేర్లతో, ప్రభుత్వ పథకాలు, పార్టీ పేరుతో సర్వేలు చేయించుకుని ఎప్పటికప్పుడు అంచనాకు వస్తున్నారు.