Jal Shakti Meeting Delhi | ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు

‘మేం కలవకూడదని, కొట్లాడుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా వాళ్లు సమస్యను పరిష్కరించలేకపోయారు. అధికారం పోయిందనే బాధలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Jal Shakti Meeting Delhi | ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు

Jal Shakti Meeting Delhi | వివిధ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను లెక్కించేందుకు టెలి మెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఢిల్లీలోని జల్‌శక్తి కార్యాలయంలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు జరిగింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి సూచనకు ఏపీ అంగీకారం తెలిపింది. టెలిమెట్రీ యంత్రాల వల్ల ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుతుందో తెలిసిపోతుందని సమావేశం భావించింది. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. వారం రోజుల్లో ఈ కమిటీని నియమించనున్నారు. సాగునీటి రంగంలో సమస్యలన్నింటినీ ఇరు రాష్ట్రాలు సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి సమావేశంలో బనకచర్ల అంశమే చర్చకు రాలేదని చెప్పారు. అసలు అజెండాలోనే బనకచర్ల ప్రాజెక్టు లేదని తెలిపారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరం చెప్పాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని, ఇన్ఫార్మల్ మీటింగ్ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ హక్కులను కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి ధారాదత్తం చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ హక్కులను తిరిగి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని, నేడు జరిగిన సమావేశంలో నాలుగు అంశాలకు పరిష్కారం దొరికిందని వివరించారు.

సాగునీటి అంశంపై రాజకీయ లబ్ది కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా బీఆరెస్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘మేం కలవకూడదని, కొట్లాడుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా వాళ్లు సమస్యను పరిష్కరించలేకపోయారు. అధికారం పోయిందనే బాధలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సమస్యల పరిష్కారంపై తమకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం తమ బాధ్యతని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై ప్రస్తుతానికి తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా సమస్యల పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.