Mulugu | వేడెక్కిన ములుగు రాజకీయం.. బీఆర్ఎస్‌ నిరసన.. కాంగ్రెస్ ఆగ్రహం

Mulugu | వేడెక్కిన ములుగు రాజకీయం.. బీఆర్ఎస్‌ నిరసన.. కాంగ్రెస్ ఆగ్రహం

Mulugu | విధాత, ప్రత్యేక ప్రతినిధి : ములుగులో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి దాటి రోడ్డు మీద బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు, అక్రమాలపై బీఆర్ఎస్ సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో నిరసనకు పిలుపునిచ్చింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ చలో ములుగుకు సిద్ధమైంది. ఇరు పార్టీలు నువ్వా…నేనా అంటూ బాహాబాహీకి సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సోమవారం రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు చేపట్టారు. దీంతో ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాడ్వాయి మండలంలో జర్నలిస్టుపై దాడి, చల్వాయిలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రశ్నించిన చుక్క రమేష్ ఆత్మహత్య, జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ సోమవారం ఆ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధం అంటూ చలో ములుగుకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇరు పార్టీలు రోడ్డెక్కేందుకు సిద్ధంకావడంతో ముందుజాగ్రత్తగా నెల రోజులపాటు ములుగు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ ను పోలీసులు అమలు చేశారు.

గాంధీ బొమ్మ దగ్గర నిరసన

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ములుగు గాంధీ బొమ్మ దగ్గర నిరసన చేపట్టారు. జిల్లాలో కాంగ్రెస్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్ళు కప్పి పలువురు నాయకులు గాంధీ బొమ్మ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అరాచకాలను, ప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకించాలని నినదించారు. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వరంగల్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.

బీఆర్ఎస్ అరాచకాలతో ఘర్షణలు: మంత్రి సీతక్క

ములుగులో బీఆర్ఎస్ నాయకులు అరాచకాలకుపాల్పడుతూ ఘర్షణలను సృష్టిస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్ నాయకుల పైన పెద్ద సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తూ ఘర్షణల పేరుతో తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ బండారం బయటపడుతుందని భయపడి నిరసనల పేరుతో కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల‌పై సీతక్క ఆగ్రహించారు.

ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు: పెద్ది

కాంగ్రెస్ నాయకులు అరాచకాలు, అవినీతి అక్రమాలు ,ఇసుక దందాలు ,భూకబ్జాలు చేస్తున్నారునీ…వీటిని ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు ,భౌతిక దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికా విలేకరులకు స్వేచ్ఛ లేకుండా అక్రమ కేసులతో అణచివేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తామంటే మంత్రి సీతక్కకు భయం ఎందుకంటూ నిలదీశారు.