ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి భరోసా ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడుకు వెళ్ళిందని, అక్కడ కమల వికాసం కనిపించిందని ప్రధాని ఓటమి నైరాశ్యంలో ఉన్న బీజేపీ నేతలకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా మోడీ మాట్లాడారు.
అలాగే తనను, మా పార్టీని తిట్టినా భరిస్తాం కానీ తెలంగాణ ప్రజల జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు. అయితే కొంతకాలంగా టీఆర్‌ఎస్ బీజేపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే మండే విధంగా మాటల యుద్ధం నడుస్తున్నది.
అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ జాతీయ నేతల పేర్లు రావడం రాజకీయంగా తమకు నష్టాన్ని కలగజేస్తాయనే భావన కమలం నేతల్లో ఉన్నది. వీటన్నింటిని చెరిపేసి, రాష్ట్ర నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం ప్రధాని చేసినట్టు ఆయన వ్యాఖ్యల బట్టి అర్థం అవుతున్నది.
అయితే తెలంగాణ ప్రజల జోలికి వస్తే పరిణామాలు ఉంటాయన్న మోడీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్ట్ కు గుంజుకుని ఎనిమిదేళ్ళ కిందటే మోడీ ఈ రాష్ట్ర ప్రజలపై దండ యాత్ర మొదలు పెట్టారు. శాంతియుతంగా ఉన్న ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చ గొట్టి రాజకీయ లబ్ది పొందే యత్నం చేశారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. వివక్ష చూపెడుతున్నారు. విభజన సమస్యలు పరిష్కరించకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
స్థూలంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు పైసా పని చేయకుండా వాళ్ళపై దాడి చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంపై మిడతల దండు లెక్క దండయాత్ర చేస్తున్నది వాస్తవం కాదా? ఈ ప్రాంత ప్రజలకు ఇన్ని ద్రోహాలు చేసి ఇప్పుడు లేని ప్రేమను మాటల్లో చెప్పినంత మాత్రానా.. తెలంగాణ అస్తిత్వాన్ని పార్లమెంట్ వేదికగా అవ హేళన చేసిన విషయాన్ని అంత ఈజీగా మరిచిపోతారనుకోవడం వారి అవివేకమే.