TN | విద్యార్థినికి పీరియడ్స్.. క్లాస్ రూమ్ బయట పరీక్ష!

  • By: sr    trending    Apr 10, 2025 10:08 PM IST
TN | విద్యార్థినికి పీరియడ్స్.. క్లాస్ రూమ్ బయట పరీక్ష!

విధాత: జ్ఞానం నేర్పించాల్సిన గురువులే అజ్ఞానంగా వ్యవహరించి అమానవీయంగా ప్రవర్తించారు. ఆడ పిల్లలలో సహజ శారీరక ప్రక్రియగా వచ్చే పీరియడ్స్ (రుతుస్రావం)ను మహా పాపంగా భావించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థిని పట్ల అమానుషంగా వ్యవహారించిన ఘటన తమిళనాడులో రచ్చ రేపింది. కోయంబత్తూర్‌లో సెంగుట్టై ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినికి తొలిసారి రుతుస్రావం కాగా.. రెండ్రోజులు ఇంటి వద్దే ఉంది.

అయితే మూడో రోజున పరీక్షలు ఉండగా పాఠశాలకు వచ్చింది. పాఠశాలకు వచ్చాక పీరియడ్ విషయం ప్రిన్సిపాల్ కు చెప్పింది. పీరియడ్స్‌తో ఉన్న బాలిక తరగతి గదిలోకి రావడానికి అనుమతి లేదంటూ ప్రిన్సిపాల్ విద్యార్థినిని తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. ఈ విషయాన్నిబాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. మరుసటి రోజు తల్లి పాఠశాలకు వెళ్లగా కూతురు బయట కూర్చొని పరీక్ష రాస్తూ కనిపించింది. పాఠశాల యాజమాన్యం నిర్వాకంపై విద్యార్థిని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన అప్పట్లో వివాదం రేపింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని పరీక్షకు హాజరైందుకు వెళ్లగా ఆమెకు పీరియడ్స్ వచ్చాయి. పరీక్ష హాల్ లో కూర్చున్న విద్యార్ధిని తనకు పీరియడ్స్ వచ్చాయని.. శానిటరీ ప్యాడ్ ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపాల్‌ని అడిగింది. సహాయం చేయాల్సిన ప్రిన్సిల్ ఆ విద్యార్ధినిని రెండు గంటల పాటు బయట నిల్చోబెట్టి బాధించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు దీనిపై మహిళా సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. పీరియడ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన స్కూల్‌లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవం దారుణమంటు సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.