Kawah Ijen | అత్యంత ప్రమాదకర ‘ఆమ్ల సరస్సు’ – తాకితే బూడిదే : ఎక్కడో తెలుసా?
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న కవా ఈజెన్ బిల తటాకం ప్రపంచంలోనే అత్యంత ఆమ్లత్వం కలిగిన నీటితో సహజ అద్భుతంగా గుర్తించబడింది. నీలిపచ్చటి నీరు, రాత్రిపూట కనిపించే నీలి జ్వాలలు, బిలం చుట్టూ ఎప్పుడూ తిరుగాడే విషవాయువులు.. కానీ, వేలుపెడితే కాలిపోతుంది. అందం – ప్రమాదం రెండూ ఒకే చోట ఉన్న ప్రకృతి విచిత్రం.
Kawah Ijen: The Beautiful but Deadly Acid Lake That Burns Skin Instantly
విధాత వైరల్ డెస్క్ | హైదరాబాద్:
ఇండోనేషియాలోని జావా ద్వీపం… ఎక్కడ చూసినా మేఘాలతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని అటవీ మొక్కలు, లోతైన కొండబిలాలు. అదే ప్రాంతంలో ఒక అగ్నిపర్వత బిలం నిండా ప్రకాశించే నీలి పచ్చని నీరు. దూరం నుంచి చూస్తే దాని అందం మంత్రముగ్ధం చేస్తుంది. దగ్గరకెళితే గానీ, తెలియదు అది ఒక ఆమ్ల తటాకం. ఆ నీళ్లు తాకామా.. అంతే. తడిచినంత మేరా కాలిపోతుంది. అందం, ప్రమాదం కలిసిఉన్న ఈ తటాకం, కవా ఈజెన్. ఇండొనేషియాలోని జావా ద్వీపంలో ఉంది.
ప్రకృతి గీసిన రంగుల చిత్రం : ప్రమాదపుటంచున నిలబెట్టే మనోహర దృశ్యం

తూర్పు జావా పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ సరస్సు రంగు చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది — టీల్ (నీలి వర్ణపు పచ్చదనం)వర్ణంలో మెరిసిపోయే ఒక అలౌకిక అందం. కాసేపు మన మనస్సు గడ్డకట్టుకుపోయేంత అందం. ఈ రంగుకు కారణం ఆ అగ్నిపర్వతం లోతుల్లోంచి వచ్చే ఖనిజాలు, మాగ్మా నుంచి బయటకు వచ్చే ఆమ్లాలు. Live Science అధ్యయనాల ప్రకారం ఈ సరస్సు pH స్థాయి 0.3 కంటే తక్కువ — ఇది సాధారణ బ్యాటరీ యాసిడ్ దాహకతకు సమానమైనది.
ఈ నీటి స్పర్శ చర్మాన్ని కాల్చేస్తుంది. లోహం కరిగిపోతుంది. ఏ జీవులు బతకలేవు. అయినప్పటికీ దాని అద్భుత రంగు, దాని చుట్టూ తేలియాడే పొగ… ఇవన్నీ ఈ సరస్సును ఒక అందమైన మాయాబజార్‌లా మార్చేసాయి. సౌందర్యం — ప్రమాదం… రెండూ ఒకేచోట కనిపించే అరుదైన ప్రకృతి సౌందర్యం అంటే ఇదే.
రాత్రిపూట మెరిసిపోయే నీలిరంగు జ్వాలల సుందర కావ్యం


కవా ఈజెన్ను ప్రపంచానికి పరిచయం చేసినది దాని నీలి జ్వాలలు (బ్లూ ఫైర్). రాత్రి వేళ పర్వత శిఖరంపైకి ఎక్కే ప్రయాణికులకు ఈ దృశ్యం చూసే సరికి మాటలు రావు. గంధకపు గాలులు తీవ్రమైన వేడితో బయటికి వచ్చి ఆక్సిజన్‌తో కలిసిన వేళ ఈ నీలిరంగు మంటలు పుడతాయి. ఈ జ్వాలలు దాదాపు 600°C వరకు ఉష్ణోగ్రత కలిగిఉంటాయి.
పగలు సూర్యకాంతిలో అవి కనిపించవు. అందుకే పర్యాటకులు రాత్రి 1 గంట దాటిన తర్వాతే కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పొగతో, మలుపులతో నిండిన ఆ మార్గం ద్వారా పైకి ఎక్కడం అంత సులభం కాదు. కానీ, ఎక్కాక ఆ నీలిజ్వాలలు ఒకసారి కనిపించగానే అలసట అంతా మాయమవుతుంది.
అప్పుడే ఆ సరస్సునుండి మనిషి శరీరానికి హాని చేసే సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు కూడా బయటికి వస్తుంటాయి. అందుకే పర్యాటకులు గ్యాస్ మాస్కులు ధరించడం తప్పనిసరి. కొన్ని నిమిషాలకు మించి అ బిలం దగ్గర నిలబడటాన్ని నిపుణులు అనుమతించరు.
ప్రమాదంలోనూ జీవితం – బిలంలో పనిచేసే బాలకార్మికుల కష్టం

అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రదేశంలో కూడా జీవనం నడుస్తూనే ఉంటుంది. కవా ఈజెన్ లోయలో పనిచేసే గంధకపు బాలల కథ మరింత కఠినమైనది. రంధ్రాల నుండి బయటకు వచ్చే వేడి వాయువులు చల్లబడే సరికి పసుపు రంగు గంధకపు రాళ్లుగా గట్టిపడతాయి.
ఈ రాళ్లను పిల్లలు పగలగొట్టి, 40–50 కిలోల బరువున్న బుట్టల్లో నింపుతారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల దిగువకు కొండపైనుంచి మోసుకెళ్లడం.. రోజుకు ఒక్కసారే అయినా అది కఠినాతికఠినమైన శ్రమ. భద్రతా పరికరాలు పరిమితం. వేతనం తక్కువ. అయినప్పటికీ వారికదే జీవనాధారం.
ఇది మనిషి పట్టుదలకు ఒక నిదర్శనం

అదే సమయంలో, రోజుకు 300 మంది వరకు పర్యాటకులు వచ్చే ఈ ప్రాంతంలో గాలి ఒక్కసారిగా విషపూరితం అయ్యే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కాలిబాటలు జారిపోయేలా ఉంటాయి. బిలం దిగువకు వెళ్లేటప్పుడు ఒక్కసారి తప్పిపోతే తిరిగి రాలేని ప్రమాదం కూడా ఉంటుంది.
అందం చూడ్డానికి చేసే సాహసం కూడా ఒక్కసారిగా ప్రమాదకరంగా మారుతుంది. అయినా పట్టువదలని పర్యాటకులు, సాహసికులు రోజూ వస్తూనేఉంటారు.
అందానికి అంచు… మరణానికి ద్వారం

కవా ఈజెన్.. ఒకే చోట —
అందం, అద్భుతం, ప్రమాదం, జీవితం, అగ్నిపర్వత శక్తి — అన్నింటినీ కలిపిన అరుదైన సహజసిద్ధ ప్రకృతి వైవిధ్యం.
పచ్చని కొండల మధ్య ఉగ్రంగా ఉడికే అగ్నిపర్వతం… లోతుల్లో ఆమ్ల సరస్సు… రాత్రిపూట నీలిరంగు మంటలు… ఇది ప్రకృతి మనిషి కంటే ఎంత గొప్పదో గుర్తు చేసే ప్రదేశం.
ఇది సరదాగా చూసే పర్యాటక ప్రదేశం కాదు. పిల్లల కోసమూ కాదు. నిర్లక్ష్యం చేసే ప్రదేశం అస్సలు కాదు. కానీ ప్రకృతి శక్తిని గౌరవించే వారికి, అది ఎలా ఉంటుందో చూడాలనుకునే వారికి — కవా ఈజెన్ ప్రపంచంలోనే ఒక అరుదైన అనుభవాన్ని ఇస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram