కొండచిలువలు తమ ఆహారాన్ని అమాంతం మింగేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఎంతటి భారీ కాయాన్ని అవి తింటాయి? నిజానికి పాములు ఆహారం తీసుకునే విధానం యావత్ జంతు ప్రపంచంలోనే పూర్తిగా భిన్నమైనది. మనుషులు, ఇతర క్షీరదాలు ఆహారాన్ని ముక్కలు చేసి, నమిలి తింటాయి. కానీ పాములు తమకు చిక్కిన ఆహారాన్ని కొన్ని సందర్భాల్లో సజీవంగా, కొన్ని సందర్భాల్లో చంపిన తర్వాత స్వాహా చేస్తాయి. కొన్ని సమయాల్లో వాటికి చిక్కే ఆహారాలు వాటి పరిమాణానికి మించినవి కూడా ఉంటాయి. అటువంటి దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి. పాములకు ఎలా కావాంటే అలా మలుచుకునే దవడలు, విస్తరించుకోగల శరీరం, అందులోని శక్తిమంతమైన కండరాలే కాకుండా.. బలమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే వాటికంటే పెద్ద జంతువులను సైతం అవి సులభంగా నోట్లోకి లాగేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రత్యేకించి కొండచిలువలు ఆహారం తీసుకునే విధానాలు, జీర్ణ వ్యవస్థ దేనికి దానికే ప్రత్యేకంగా ఉంటుంది. ఆఫ్రికన్ రాక్ పైథాన్ సుమారు 68 కిలోల బరువున్న హైనాను మింగిన ఘటన ఇప్పటి వరకూ నమోదైన ఘటనల్లో అతిపెద్దదిగా భావిస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ఈ ఘటనను 2017లో లైవ్ రికార్డు చేసింది. ఈ వీడియోలో 12 అడుగులకు పైగా ఉన్న రాక్ పైథాన్.. హైనాను మొదట చుట్టేసి, ఊపిరాడకుండా చేయడం, తర్వాత క్రమంగా తన దవడలను విస్తరించి, దానిని నోట్లోకి తీసేసుకోవడం కనిపిస్తుంది. హైనా అనేది కూడా ఇతర జంతువులను వేటాడగలిగిన శక్తి కలిగిన జీవి. అలాంటి జంతువును సైతం కొండచిలువ మింగేయడం అప్పట్లో సంచలనం రేపింది. అంతకు ముందు 1955లో సుమారు సుమారు 59 కిలోల బరువు ఉన్న ఇంపాల జింకను మింగినట్టు రికార్డులు ఉన్నాయి. ఇవి కేవలం అప్పటికప్పుడు రికార్డు చేసినవే. వీటికంటే పెద్ద జంతువులను కూడా కొండచిలువలు వేటాడిన సందర్భాలు ఉండి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేటలో కొండచిలువలు విషం బదులు వాటి శరీరంతో చుట్టుముట్టి బిగించడం ద్వారా చంపుతాయి.
ఏ పాము వేటిని తింటుంది?
సహారా ఎడారి దక్షిణ ప్రాంతాల్లో కనిపించే ఆఫ్రికన్ రాక్ పైథాన్.. కోతులు, అడవి పందులు, జింకలు, మేకలు, కుక్కలు, పక్షులతోపాటు.. చిన్నపాటి మొసళ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇప్పటి వరకూ అతిపెద్ద నమోదైన వేట రికార్డు దీని పేరుతోనే ఉండటం గమనార్హం. గ్రీన్ అనకొండ సైతం దాదాపుగా వీటినే తింటుంది. రిటిక్యులేటెడ్ పైథాన్.. ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువ జాతి సర్పం. దీని ఆహారాలు కూడా ఇంచుమించు అవే ఉంటాయి.
ఏమిటా సూపర్ పవర్?
మానవులకు దిగువ దవడ ఒకే ఎముకగా ఉంటుంది. కానీ.. సర్పాల్లో రెండు భాగాలుగా ఉంటుంది. రెండు భాగాలూ సాగే గుణంతో ఉన్న కండరంతో అనుసంధానం అవుతాయి. ఫలితంగా కొండచిలువలు తమ నోటిని ఆహారానికి అనుగుణంగా తెరవగలుగుతాయి. ఇక ఒకసారి ఆహారం పూర్తిగా కడుపులోకి వెళ్లిపోగానే.. పాముల్లో జీర్ణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. కొండచిలువల్లో విడుదలయ్యే అత్యంత శక్తిమంతమైన జీర్ణరసాలు.. అది తిన్న జీవి మాంసం, అంతర్గత అవయవాలే కాకుండా చాలా వరకూ ఎముకలను కూడా కరిగించేస్తాయి. ఇలా ఒకసారి ఆహారం తీసుకున్నాక కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలపాటు వాటికి ఆహారం అవసరం లేదు. పాముల రక్తం చల్లగా ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రతలను మెయింటెన్ చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చుచేయాల్సిన పని ఉండదు. అందుకే అవి ఒక్కోసారి కొన్ని నెలలపాటు ఆహారం లేకుండా ఉండగలుగుతాయి.
