భావోద్వేగ క్షణం… తలపతి విజయ్​ డ్రైవర్​ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే!

డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్. విరుగంబక్కం నుంచి పోటీ చేసిన శబరీనాథన్ భారీ ఆధిక్యంతో గెలుపొందడం ఈ ఎన్నికల్లో భావోద్వేగ క్షణం..

భావోద్వేగ క్షణం… తలపతి విజయ్​ డ్రైవర్​ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే! విశ్వాసం – స్నేహం – విజయం… ఒక్క ఫ్రేమ్‌లో ముగ్గురు

Driver’s Son to MLA: Vijay’s Emotional Bet Turns Into Massive Political Win

ముఖ్యాంశాలు

  • విజయ్ ఎమోషనల్​ టికెట్​ ఎమ్మెల్యేగా మారింది.
  • తన డ్రైవర్​ కొడుకు శబరీనాథన్ భారీ ఆధిక్యంతో గెలుపు
  • DMK అభ్యర్థిపై 27,086 ఓట్ల తేడాతో ఘనవిజయం
  • TVK తొలి ఎన్నికల్లోనే సంచలన ప్రదర్శన
  • సాధారణ కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయి

విధాత భారత్​ డెస్క్​ | మే 4, 2026 | హైదరాబాద్​:

తమిళ సినీ రంగంలో స్టార్‌గా వెలిగిన తలపతి విజయ్​… ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ చూపిస్తున్నాడు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) తొలి ఎన్నికలలోనే సంచలన ఫలితాలు నమోదు చేస్తుండగా, ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడి కథ ప్రజల హృదయాలను తాకుతోంది. తన డ్రైవర్ కొడుకుకే టికెట్ ఇచ్చిన విజయ్ నిర్ణయం ఇప్పుడు విజయం రూపంలో ప్రత్యక్షమవడం రాజకీయాల్లో అరుదైన సంఘటనగా మారింది.

డ్రైవర్ కుటుంబం నుంచి రాజకీయాల వరకు..

చెన్నైకు చెందిన రాజేంద్రన్ గత 15 సంవత్సరాలుగా విజయ్ వ్యక్తిగత డ్రైవర్‌గా పని చేస్తూ ఆయన ప్రయాణానికి సాక్షిగా నిలిచాడు.  రాజేంద్రన్​ కొడుకు ఆర్. శబరీనాథన్ సాధారణ మధ్యతరగతి యువకుడు. కానీ పార్టీ స్థాపించినాటి నుండి క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి తనకంటూ గుర్తింపు సంపాదించాడు.

 టికెట్ ఇచ్చిన క్షణంవైరల్ అయిన భావోద్వేగం

సబరీనాథన్‌ను ఓదార్చుతూ విజయ్ హత్తుకున్న భావోద్వేగ క్షణం

టికెట్ ఇచ్చిన క్షణం… శబరీనాథన్ ఆనందబాష్పాలు, విజయ్ హగ్ వైరల్

ఈ ఏడాది మార్చిలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ విజయ్ అకస్మాత్తుగా శబరీనాథన్‌కు విరుగంబక్కం టికెట్ ఇవ్వడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అక్కడే వేరే పనుల మీద ఉన్న శబరీనాథన్​ ఉన్నట్టుండి తన పేరు వినిపించేసరికి తట్టుకోలేక భోరున విలపిస్తూ విజయ్ కాళ్లకు నమస్కరించాడు. విజయ్​ శబరిని లేపి హత్తుకున్నాడు. ఆ సమయంలో తండ్రి రాజేంద్రన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని కదిలించింది. విజయ్ అతన్ని ఓదార్చుతూ కన్నీళ్లు తుడిచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చాలమంది చూసారు. ఈ సంఘటన రాజకీయ నిర్ణయాన్ని మించి ఒక నమ్మకానికి ప్రతీకగా నిలిచింది.

.అది కేవలం ఒక టికెట్ ఇవ్వడం కాదు… ఒక కుటుంబం మీద ఉన్న విశ్వాసాన్ని ప్రజల ముందుంచిన క్షణం. విజయ్ కూడా సబరీనాథన్‌ను దగ్గరకు తీసుకుని అతని కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది దీనిని “నిజ జీవిత సినిమా సీన్”గా అభివర్ణించారు.

 భారీ ఆధిక్యంతో విజయం సాధించిన శబరీనాథన్… నమ్మకానికి ప్రతిఫలం

ఆ భావోద్వేగ క్షణం ఇప్పుడు రాజకీయ ఫలితాల్లో ప్రతిఫలిస్తున్నట్టు కనిపిస్తోంది. విరుగంబక్కం నియోజకవర్గంలో పోటీ చేసిన శబరీనాథన్ 27.086 ఓట్ల  భారీ మెజారిటీతో విజయం సాధించాడు. డిఎంకే(Dravida Munnetra Kazhagam) అభ్యర్థిపై వేలాది ఓట్ల తేడాతో ప్రతీ రౌండ్​లో ఆధిక్యం కనబరుస్తూ గెలుపు దిశగా దూసుకెళ్లాడు.

తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న Tamilaga Vettri Kazhagam పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఎన్నికలే అయినప్పటికీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధిస్తూ పాత పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు… ప్రజలు కొత్త నాయకత్వాన్ని స్వాగతిస్తున్న సంకేతంగా భావిస్తున్నారు.

శబరీనాథన్ కథలో ప్రజలను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం అతని నేపథ్యం. ధనిక కుటుంబం కాదు, రాజకీయ నేపథ్యం కూడా లేదు… తండ్రి ఒక కారు డ్రైవర్​. కానీ కష్టపడి పార్టీ కోసం పని చేసిన ఒక యువకుడిగా అతను ఎదిగాడు. ఇదే విషయం ప్రజల మనసులకు బాగా చేరువైంది. విజయ్ కూడా తన పార్టీ “స్టార్ల కోసం కాదు… సాధారణ ప్రజల కోసం” అనే సందేశాన్ని ఈ నిర్ణయం ద్వారా బలంగా చాటాడు.

సినిమాలాంటి నిజం..

విజయ్ తన డ్రైవర్ రాజేంద్రన్ మరియు అతని కుమారుడు శబరీనాథన్‌తో కలిసి ఉన్న ఫోటో

డ్రైవర్ కుటుంబంతో విజయ్ — విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బంధం

సినిమాల్లో హీరోలు పేదవాళ్లను పైకి తీసుకువచ్చే కథలు మనం చూస్తుంటాం. కానీ అదే కథ ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతుండటం ప్రజలను కదిలిస్తోంది. ఒక డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా మారబోతున్న ఈ సంఘటన… రాజకీయాలకే కొత్త అర్థాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది.

ఈ కథలో విజయం కేవలం శబరీనాథన్‌ది మాత్రమే కాదు… అతని తండ్రి కష్టానికి, విజయ్ నమ్మకానికి, ముఖ్యంగా సాధారణ ప్రజల ఆశలకు దక్కిన గెలుపు ఇది. తమిళనాడులో ప్రారంభమైన ఈ భావోద్వేగ ప్రయాణం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం మాత్రం ఖాయం.

ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు… సాధారణ కుటుంబాల ఆశలకు దక్కిన గెలుపు. డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా మారబోతున్న ఈ కథ… రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తోంది.