Fresh Milk | పాలు ఆరోగ్యానికి మంచిదని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ప్రతిరోజూ తాగుతుంటారు. ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్యాకెట్ పాల కంటే స్వచ్ఛమైన ఆవు లేదా గేదె పాలను కొనుగోలు చేస్తుంటాయి. ప్యాకెట్ పాల కంటే ధర ఎక్కువైనా వెనుకాడకుండా బయట పాల వ్యాపారుల దగ్గర తాజా పాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ నమ్మకాన్ని ప్రశ్నార్థంగా మార్చే ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్యాకెట్ పాలనే క్యాన్‌లో పోసి అమ్ముతున్న వీడియో చూసి ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. నిజంగా మనం తాగేవి స్వచ్ఛమైన తాజా ఆవు లేదా గేదే పాలేనా అని అనుమానాలు వస్తున్నాయి.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పాల వ్యాపారి మరో వ్యక్తి దగ్గర పాల ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అనంతరం ఆ ప్యాకెట్లను చించి అందులోని పాలను తన క్యాన్‌లో పోసుకున్నాడు. ఆ తర్వాత అవే పాలను ఊరిలో తిరుగుతూ తాజా పాలు, స్వచ్ఛమైన పాలు అంటూ వీధి వీధి తిరుగుతూ విక్రయించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. నిజంగా మన ఇంటి వద్దకు వచ్చే పాలు ఎంతవరకు నాణ్యమైనవి? అసలు అవి నిజంగా గేదె లేదా ఆవు పాలేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
🗣️: मेरा दूधवाला सबसे अलग है, वो मिलावट नहीं करता।
Meanwhile that mf: pic.twitter.com/f1JBE3v1rT
— रावण (@raavan_india) May 28, 2026
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను @raavan_india అనే యూజర్ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లూ మనం తీసుకున్నవి నిజంగా స్వచ్ఛమైన పాలేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే మరికొందరు మాత్రం.. ఈ ఒక్క వీడియో ఆధారంగా అందరు పాల వ్యాపారులను అనుమానించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా, వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ జరిగింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.