Girija Oak | ఇంటర్‌నెట్ తాజా సంచలనం – ‘బ్లూ శారీ వాలీ’: ఎవరీ వైరల్ వయ్యారి?
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఒక ఫోటో చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. నీలంరంగు చీర ధరించి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న ఒక మహిళ ఫోటో అనూహ్య వేగంతో వైరల్ అయింది. “బ్లూ శారీ వాలీ” అంటూ వేలాది పోస్టులు, మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తాయి. ఎవరీ 'బ్లూ శారీ వాలీ'? అని.
Girija Oak – The Viral ‘Blue Saree Woman’ Who Took the Internet by Storm
ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో.. ఇంటర్నెట్‌ను అల్లల్లాడించింది. నీలం రంగు చీర ధరించిన ఒక మహిళ. సాదాసీదాగా కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తున్న ఫోటో. ఆ ఫోటోలో ఆమె అందం, హుందాతనం, గ్రేస్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. అంతే.. ఇక వేట మొదలైంది. ఎవరీమె? అంటూ తెగ వెతికారు. మొత్తానికి ఆవిడెవరో తెలిసిపోయింది. ఒక్క రాష్ట్రానికి తప్ప దేశానికంతా ఆమె అపరిచితురాలే. ఆ ఒక్క రాష్ట్రం మహారాష్ట్ర. ఆమె మరెవరో కాదు, ప్రముఖ మరాఠీ నటి గిరిజా ఓక్.
‘బ్లూ శారీ వాలీ’ వీడియో : మెరుపువేగంతో వైరల్

ఈ మధ్య గిరిజా ఓక్ లల్లన్టాప్కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జూనియర్ కాలేజ్ రోజుల్లో జరిగిన ఓ చిన్న హాస్య సంఘటనను చెప్పింది. ఆమె ఫిజిక్స్ టీచర్, పాఠంలో భాగంగా “There are two types of babes — transverse babes and longitudinal babes” అని చెప్పగానే తామంతా అయోమయానికి గురైనట్లు, ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని పెద్దగా నవ్వేసింది. ‘waves’ అనే పదాన్ని ‘babes’ అని తప్పుగా ఉచ్చరించిన టీచర్ ఉదంతాన్ని సరదాగా చెప్పింది. ఈ చిన్న క్లిప్ బయటికి రాగానే వీడియోలోని ఒక స్టిల్ ఫోటో సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. కేవలం ఒక స్టిల్ ఫోటోతో గిరిజా ఓక్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. వేలాది మంది ఆమె ఎవరో తెలుసుకునేందుకు శోధించారు. కొందరు ఆమెను విదేశీ మాడళ్లతో పోల్చారు. మరికొందరు ఆమెను కొత్త క్రష్‌గా అభివర్ణించారు.
ఇంతకీ ఎవరీ గిరిజా ఓక్.?

గిరిజా ఓక్ గురించి తెలియని వారు ప్రస్తుతం తెలుసుకుంటుండగా, మరాఠీ ప్రేక్షకులు మాత్రం, మీకు ఆమె ఇప్పుడు తెలుసు. మాకెప్పటినుంచో తెలుసునని గర్వగా వ్యాఖ్యానించారు. ఇక వివరాల్లోకి వస్తే, గిరిజా ఓక్ (38)27 డిసెంబర్ 1987న నాగ్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి గిరీష్ ఓక్ మరాఠీ ఇండస్ట్రీలో ప్రసిద్ధ నటుడు. ఆమె బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి, థియేటర్, నటన శిక్షణ పొందింది. ఆమె తారే జమీన్ పర్, షోర్ ఇన్ ది సిటీ, జవాన్, ది వాక్సిన్ వార్ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించింది. మరాఠీ సినిమాల్లో కూడా గుల్మోహర్, లజ్జా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ సినిమా హౌస్‌ఫుల్‌లో కూడా నటించింది. టీవీ, OTTలో లేడీస్ స్పెషల్, మాడర్న్ లవ్ ముంబై, ఇన్‌స్పెక్టర్ జెండే, తాజా సిరీస్ థెరపీ షెరపీ వంటి ప్రాజెక్టుల్లో కనిపించింది. ఆమె భర్త మరాఠీ చిత్ర నిర్మాత, దర్శకుడు సుహృద్ గోడ్బొలే. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
ఓవర్‌నైట్ స్టార్డమ్తో ఇబ్బందులు

అయితే ఈ ఆకస్మిక ప్రఖ్యాతితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. కొందరు ఆమె ఫోటోలను అసభ్యంగా ఉపయోగించడం, కొన్ని AI-morphed చిత్రాలను సృష్టించడం ఆమెను తీవ్రంగా కలచివేసాయి. “ఈ చిత్రాలు నా 12 ఏళ్ల కొడుకు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు చూసే అవకాశం ఉంది. అదే నన్ను ఎక్కువగా బాధపెడుతోంది,” అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అయినా, ఆమె శాంతంగా స్పందిస్తూ, ఇవన్నీ తాత్కాలికం. కానీ నేను చేసే పని మాత్రం శాశ్వతం. ఈ పేరుప్రఖ్యాతుల వల్ల ఎవరికైనా నేనేంటో తెలిస్తే అదే నాకు పెద్ద సంతోషమని తెలిపింది.
ఇంటర్నెట్‌ను కుదిపేసిన ఆ నీలం చీర ఫోటో ఏదో ప్రత్యేక ఫోటోషూట్ అనుకుంటే పొరపాటే. అది లల్లన్‌టాప్ ఇంటర్వ్యూలో మధ్యలో సడన్‌గా ఆగినప్పటి వీడియో స్టిల్. ఎలాంటి లైటింగ్ సెటప్, స్టైలింగ్ లేకుండా తీసిన ఆ ఫ్రేమ్‌నే దేశవ్యాప్తంగా లక్షలాది మంది షేర్ చేసారు. సహజమైన అందం, అసాధారణ హుందాతనం, సాదాసీదా వాతావరణం, నిజమైన వ్యక్తిత్వం — ఇవన్నీ కలిసి ఆ ఫోటోను ఒకరోజులోనే సంచలనంగా మార్చాయి.

వైరల్ ఫోటోలు వస్తాయి పోతాయి…
కానీ గిరిజా ఓక్ చూపించిన సహజత్వం, నవ్వులోని ప్రశాంతత, మాటల్లోని సంయమనం… సోషల్ మీడియా యుగంలో అరుదైన విలువలు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram