Drunk Man Offers Liquor To Tiger : ఓర్నీ….తాగితే పులి కూడా పిల్లియేనా..! నిజమా? ఏఐ కల్పనా?

మధ్యప్రదేశ్‌లో రాజు పటేల్ అనే కూలీ మద్యం మత్తులో ఎదురైన పులిని పిల్లి అనుకుని, దానికి లిక్కర్ తాగమని బతిమాలాడాడు. పెంచ్ నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డై వైరల్‌గా మారింది. పులి అతనికి ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇది ఏఐ క్రియేషన్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.

Drunk Man Offers Liquor To Tiger : ఓర్నీ….తాగితే పులి కూడా పిల్లియేనా..! నిజమా? ఏఐ కల్పనా?

విధాత : మందుబాబులు ఫుల్ గా తాగక మత్తులో పాములతో చెలగాటం ఆడటం..రాష్ డ్రైవింగ్, టవర్లు ఎక్కడం వంటి వింత చేష్టలు..దుస్సాహసాలు చేయడం తరుచూ చూస్తుంటాం. కొందరు ధైర్యం కోసం మందు తాగేసి చేయాల్సిన పని చేసేస్తుంటారు. మరికొందరైతే మద్యం మత్తులో ఎదురుగా ఏమున్నా లెక్క పెట్టకుండా వ్యవహరిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లో ఓ మందుబాబు మాత్రం మత్తులో పులికి ఎదురుపడి దానికి లిక్కర్ తాగించడం చూస్తే..ఓర్నీ..మందు కిక్కుకు ఇంత పవర్ ఉందా అనిపించకమానదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కూలీ రాజు ప‌టేల్‌(52) ఓ రోజు ఇంట్లో తయారు చేసిన మద్యం ఫుల్ గా తాగేసి..చేతిలో ఓ మందు బాటిల్ పట్టుకుని తాగుకుంటునే రోడ్డుపైకి వెళ్లాడు.

తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో మ‌ద్యం తాగుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు ప‌టేల్‌కు ఓ పెద్ద పులి ఎదురుపడింది. మనోడు మ‌త్తులో అది పెద్ద పిల్లి అనుకుని..ఏ పిల్లి పక్కకు వెళ్లు అంటూ ఆ పులిని ఏ మాత్రం లెక్కచేయకుండా దాని తలనుప్రేమగా నిమురుతు చేతిలో ఉన్న బాటిల్ లోని మందు తాగమంటూ బతిమాలాడాడు. ఎంత సేప‌టికి పులి ఆ మందు తాగ‌క‌పోయేస‌రికి కొద్దిసేపు ఇద్దరు(పులి, రాజు) కూడా మాట ముచ్చట సాగించేసి ఎవ‌రిదారిన వారు వెళ్లిపోయారు. ఇంతజరిగినా ఆ పెద్దపులి రాజు పటేల్ ను ఏమి ఆనకుండా పెంపుడు పిల్లి, కుక్క మాదిరిగా అతనితో వ్యవహరించడం అశ్చర్యపరిచింది.

ఏఐ వీడియోనా?

నిజాలు నిలకడమీదగానీ తేలవంటారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత నిపుణులు దీనిని ఏఐ క్రియేషన్ అని తేల్చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఇంత ఆసక్తికర ఘటన చోటు చేసుకుందని చెబుతున్నా.. ఏ ప్రముఖ మీడియాలో లేదా పత్రికల్లో ఈ వార్త కనిపించకపోవడం. ఇదెలా ఉన్నా.. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మాత్రం సరదా కామెంట్లతో చెలరేగిపోయారు. అతను తయారు చేసిన ఇంటి లిక్కర్ మాకు కావాలంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఏఐ కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియడంలేదని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు.. ‘రాజు ఇప్పుడు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉన్నాడు. తన సోషల్ మీడియా అకౌంట్ మూసేశాడు. స్థానికంగా ఉండే భర్తలు.. పులిని సైతం పిల్లిని చేసిన ఆ హోం మేడ్ లిక్కర్ ఏమిటో తమకూ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు..’ అని రాశాడు.