భారత్ వంటి దేశంలో వరదల సమయంలో నదులు పొంగినప్పుడు..చెరువులు, రిజర్వాయర్లు నిండి అలుగు పోసినప్పుడు రోడ్ల మీదుగా వరద నీటిలో చేపలు కొట్టుకరావడం చూస్తుంటాం. శ్రీలంకలో సంభవించిన వరదలలో మాత్రం అందుకు భిన్నంగా భారీ సంఖ్యలో చేపల తరహాలో మొసళ్లు వరద నీటిలో రోడ్లు, కల్వర్టుల మీదుగా కొట్టుకరావడం ఆశ్చర్యపరిచింది.
శ్రీలంకలోని కుమానలో వరద నీటి గుండా ప్రయాణిస్తున్న ఒక వాహన దారుడు తన వెళ్తున్న దారిలో వరద నీటిలో రోడ్డు కల్వర్టు మీదుగా కొట్టుకపోతున్న మొసళ్ళ చూసి సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించగా..అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మొసళ్లు, పక్షులకు ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యమైన కుమాన నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. వరద నీటిలో రోడ్డుకు అడ్డంగా, పక్కన చురుకుగా ఈదుతున్న మొసళ్లను చూసిన నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. మొసళ్లతో నిండిన వరద నీరు..రోడ్లపైన మొసళ్ల ఈదులాటలు అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
శ్రీలంకలో తాజాగా సంభవించిన రుతుపవన వరదల సమయంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల ఉదృతికి అభయారణ్యాలు, నేషనల్ పార్కులలోని వన్యప్రాణులు తమ ఆవాసాల నుంచి గల్లంతయ్యాయి. పలుచోట్ల అటవీ ప్రాంతాల నుంచి జనావాసాలు, రహదారులపై వన్యప్రాణులు కొట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే కుమానా నేషనల్ పార్కులో వరదల ఉదృతికి మొసళ్లు రోడ్ల మీదుగా నీటిలో కొట్టుకువచ్చాయని సమాచారం.
A flooded road in Sri Lanka….😱 pic.twitter.com/MWbfq9dYxw
— Bengal’s untold tales (@Gramergolpo) June 29, 2026
