Tiger Attack On Fisherman : చేపలు పడుతుండగా..పులిదాడి వైరల్

పశ్చిమ బెంగాల్ సుందర్‌బన్ అడవుల్లో బోటుపై చేపలు పడుతున్న ఇద్దరు మత్స్యకారులపై రాయల్ బెంగాల్ టైగర్ ఒక్కసారిగా దాడి చేసింది. పులి, జాలర్లు నీటిలో పడటంతో, సహచరుల కేకలకు పులి వారిని వదిలి పారిపోయింది. ఈ వీడియో వైరల్ అయింది.

Tiger Attack On Fisherman : చేపలు పడుతుండగా..పులిదాడి వైరల్

విధాత: బోటుపై సరస్సులో చేపలు పడుతున్న జాలరులపై ఒక్కసారిగా పులిదాడి చేసిన ఘటన వైలర్ గా మారింది. పశ్చిమ బెంగాల్  సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని సరస్సులు, నదులలో సమీప ప్రాంతాల ప్రజలు చేపలు, పీతలను వేటాడుతూ జీవిస్తుంటారు. ఈ క్రమంలో వారు తరుచు పులుల బారిన పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మడ అడవుల్లోని నదిలో బోటుపై చేపల వేటలో నిమగ్నమైన ఇద్దరు మత్స్యకారులపై ఒడ్డు నుంచి అకస్మాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ దాడికి పాల్పడింది. పులి ఒక్కసారిగా వారిపై జంప్ చేయడంతో వారిలో ఒకరు పులి నోటికి చిక్కినప్పటికి నీటిపై బోటు బ్యాలెన్స తప్పడంతో పులితో పాటు జాలర్లు నీటిలో పడిపోయారు.

బోటుకు మరోవైపు నీళ్ల లోతు ఎక్కువగా ఉండటం..సహచర జాలర్లు గట్టిగా కేకలు వేయడంతో పులి వారిని వదిలేసి ఒడ్డువైపు పారిపోయింది. దీంతో ఆ ఇద్దరు కార్మికులు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్షణాల్లో పెద్దపులి బారి నుంచి ప్రాణపాయం తప్పిందని మత్స్యకార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. వీడియో చూసిన నెటిజన్లు..వామ్మో భూమి మీద ఇంకా నూకలు ఉండటంతో ఆ మత్స్యకార్మికులు పెద్దపులి బారి నుంచి బయటపడ్డారని కామెంట్లు చేస్తున్నారు.

సుందర్బన్ లోని జర్ఖాలి అటవీ ప్రాంతంలో నదిలో చేపలు, పీతలు పడుతున్న జాలరీపై హరిపాద దాస్(34) సైతం బోటుపై ఉన్నప్పుడే పులి దాడికి గురయ్యాడు. సకాలంలో సహచరులు స్పందించి పులిపై తిరగబడటంతో అతను తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కలాష్ ద్వీపం సమీపంలో42 ఏళ్ల జాలరి శంకర్ భక్త పులి దాడిలో మృతి చెందాడు. పడవలో భోజనం చేస్తుండగా పులి దాడి చేసి చంపేసింది. అంతకుముందు సుందర్బన్ అడవిలో సరస్సులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇషార్ రోనోజిత్ హల్దార్ పెద్దపులి దాడిలో చనిపోయాడు.