Telangana BJP Politics | ప్రత్యామ్నాయం కాదు! పొత్తులే దిక్కా? బీఆరెస్‌, బీజేపీ పొత్తు ఖాయమన్న కాంగ్రెస్‌

ఇంటి దగ్గర కూర్చుని పారాయణం చేస్తున్న వ్యక్తిని పిలిచి అధ్యక్ష పదవి ఇచ్చారంటే.. ఏ ప్రణాళిక మీద ఇచ్చారో చూడాల్సి ఉందని భువనగరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని రాత్రి వరకు ఎవరైనా ఏమైనా చేసుకుంటారేమో చూడాలన్నారు.

Telangana BJP Politics | ప్రత్యామ్నాయం కాదు! పొత్తులే దిక్కా? బీఆరెస్‌, బీజేపీ పొత్తు ఖాయమన్న కాంగ్రెస్‌

Telangana BJP Politics | హైదరాబాద్, జూలై 30 (విధాత) : క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే బీజేపీలో చిచ్చురేగింది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన రాష్ట్ర అధ్యక్ష ఎంపిక అనూహ్య పరిణామాలకు దారితీసింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ నాయకులు ఏ సమావేశంలోనైనా నొక్కి వక్కాణించి చెబుతున్నారు. దీంతో ప్రజామోదం, పార్టీని డైనమిక్‌గా ముందుకు తీసుకుపోయే నాయకులను అధిష్ఠానం ఎంచుకుంటుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌తోపాటు.. పలువురు బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్ల పేర్లు చర్చలోకి వచ్చాయి. మరోవైపు అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ఒకటి నడిపించారు. అయితే.. ఎమ్మెల్సీ నారపురాజు రామచందర్‌రావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎంపిక లాంఛనంగా మారింది. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సూచన మేరకే రామచందర్‌రావుతో నామినేషన్‌ వేయించారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవికి ఎంపికైన వారి పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఒకరే నామినేషన్ వేసినందున రామచందర్ రావు ప్రకటన లాంఛనప్రాయమే అవుతుంది. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఘోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. నామినేషన్‌ వేసేందుకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే.. నామినేషన్‌ వేయకుండా తనను అడ్డుకున్నారని రాజాసింగ్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిరసనగా బీజేపీ రాజీనామా చేశారు. శాసనసభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తూ ఆ లేఖను పార్టీ నాయకత్వానికి అందించారు. నా వాడు, నీ వాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి నష్టమంటూ విమర్శించారు.

పార్టీ శ్రేణుల్లోనూ విస్మయం!

పార్టీ శ్రేణుల్లో సైతం రామచందర్‌రావు ఎంపిక విస్మయాన్ని కలిగించిందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు అని చెప్పి.. అధిష్ఠానం నేరుగా ఎంపిక చేయడమేంటన్న సందేహాలను పలువురు కార్యకర్తలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేని నాయకుడు, ప్రజల్లో బలం కూడా లేని నాయకుడు, దాదాపు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని మాజీ ఎమ్మెల్సీని ఎంపిక చేయడంపై సీనియర్ నాయకులు సైతం కుతకుతలాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎదిగే ఆలోచన బీజేపీ కి లేదని, పొత్తులతోనే అధికారంలోకి వస్తామనే లక్ష్యంతో భాగంగా అధ్యక్ష పదవికి పేరు ఖరారు అయ్యిందని, ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల లేదని అర్థమవుతోందని కాషాయ శ్రేణులు చర్చించుకోవడం విశేషం. క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పే వయస్సులో ఉన్న రామచందర్ రావు (66)ను ఏ ప్రాతిపదికన అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారో అర్థం కావడం లేదని బీజేపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాల్టీలు, ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసి ఉరుకులు పరుగులు పెట్టించాల్సిన నాయకుడికి పార్టీ పగ్గాలు ఇచ్చే బదులు కృష్ణారామా అంటూ శేష జీవితం గడిపే వృద్ధుడికి ఇచ్చారంటూ కమలనాథులు అంతర్మథనం చెందుతున్నారు. పోటీని నివారించే క్రమంలో మధ్యేమార్గంగా రామచందర్‌రావు తెరపైకి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే.. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయాలని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయాలని జాతీయ నాయకత్వం ఆలోచించడం లేదని స్పష్టమవుతున్నదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. రాజాసింగ్ రాజీనామా విషయాన్ని రాష్ట్ర పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పార్టీ సుప్రీం అని, కట్టుబడి ఉండాలని పలువురు సీనియర్ నాయకులు హితవు పలకడంతో సరిపెట్టేశారు.

పొత్తుల కోసమే?

రాష్ట్రంలో బీజేపీ స్వయం ప్రకాశితం కాదని, స్వంతంగా ఎదిగే అవకాశాలు కన్పించడం లేదనే నిర్ణయానికి కొందరు ముఖ్య నాయకులు వచ్చారని తెలుస్తున్నది. ప్రాంతీయ పార్టీతో పొత్తులకు వెళితే తప్ప తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యం అనే విధంగా ఢిల్లీలోని పార్టీ పెద్దలకు చెబుతూ వస్తున్నారని సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎంతగా శ్రమించినా సాధ్యం కావడం లేదని చేతులెత్తేశారని తెలిసింది. ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు పార్టీ బధ్యతలు అప్పగించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన వారు నారాజ్ అవుతారని అధిష్ఠానానికి చెప్పుకొన్నారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, రాజాసింగ్ వంటి వారు పోటీపడ్డారు. హిందూ భావజాలం అంతగా లేని రాజేందర్ ఎంపికపై ఆర్ఎస్ఎస్‌తోపాటు సీనియర్ నాయకుల్లో సైతం అభ్యంతరాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. బయట పార్టీల నుంచి వచ్చినవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఊరుకునేది లేదని కూడా కొందరు ఢిల్లీ పెద్దల వద్ద తెగేసి చెప్పారని సమాచారం. ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి వచ్చారు. వీరిలో ఎవరిని ఎంపిక చేసినా తలనొప్పులు వస్తాయని, మధ్యేమార్గంగా వివాదరహితుడు అయిన రామచందర్ రావును నియమించడం మేలనే నిర్ణయానికి వచ్చి ఉంటారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో బీజేపీ పొత్తులకు వెళ్తుందనేది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీసీ వ్యతిరేక పార్టీ… భగ్గుమన్న కాంగ్రెస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచందర్ రావు ఎంపిక అవుతున్నారని తెలిసిన తరువాత కాంగ్రెస్ నాయకులు విమర్శల ధాటిని పెంచారు. బీజేపీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా, బీసీ సీనియర్ నేతలు ఉన్నా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం లేదన్నారు. గతంలో బీసీ ముఖ్యమంత్రిని అంటూ హామీ ఇచ్చి కనీసం శాసన సభాపక్ష నాయకత్వ పదవి కూడా బీసీలకు ఇవ్వలేదని దెప్పి పొడిచారు. అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ ఎమ్మెల్యే నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నదని బీజేపీలోని నేతలే వాపోతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.

ఇంట్లో కూర్చొన్న వ్యక్తికి అధ్యక్ష పదవా?

ఇంటి దగ్గర కూర్చుని పారాయణం చేస్తున్న వ్యక్తిని పిలిచి అధ్యక్ష పదవి ఇచ్చారంటే.. ఏ ప్రణాళిక మీద ఇచ్చారో చూడాల్సి ఉందని భువనగరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని రాత్రి వరకు ఎవరైనా ఏమైనా చేసుకుంటారేమో చూడాలన్నారు. గూడు చెదిరిందంటూ.. కల చెదిరందంటూ ఆశావహులు పాడుకోవాల్సిన దుస్థితి ఉందని కిరణ్ సైటైర్లు వేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తులకు తొలి అడుగు పడిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీ, కేంద్రంలో బీజేపీకి బీఆరెస్‌ మద్దతు ఇచ్చుకుంటాయని, ఇదే ఒప్పంద సారాంశమని టీజీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో బ్రాహ్మణ, బనియా, జనతా పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. అగ్రకుల హిందువులకు ఒక న్యాయం, బీసీ హిందువులకు ఇంకొక న్యాయమా? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ హిందువులపై కాషాయ పార్టీలో వివక్ష చూపిస్తున్నారని, ఎంతోమంది బీసీలు పార్టీ అధ్యక్ష పదవికి అర్హులుగా ఉనప్పటికీ, వారికి బీసీ కులమే అనర్హతగా మారిందని ఆయన అన్నారు.