BRS Medigadda collapse | బీఆరెస్‌ను వెంటాడుతున్న కుంగుబాటు! మేడిగడ్డ ఘటనపై రోజుకో మాట!

కేసీఆర్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక బరాజ్‌ మేడిగడ్డ కుంగుబాటు.. బీఆరెస్‌ను వెంటాడుతున్నట్టే కనిపిస్తున్నది. దీనిని నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో బీఆరెస్‌ నేతలు రోజుకో వాదన లేవనెత్తుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

BRS Medigadda collapse | బీఆరెస్‌ను వెంటాడుతున్న కుంగుబాటు! మేడిగడ్డ ఘటనపై రోజుకో మాట!

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 23 (విధాత) :

BRS Medigadda collapse | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై బీఆర్ఎస్ నాయకులు ఒక్కో సమయంలో ఒక్కో రకంగా మాట్లాడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం పాపం వెంటాడుతుండటంతోనే ప్రాజెక్టుపై విచారణ నిర్వహించిన పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఒక రకంగా, హైకోర్టులో మరో రకంగా వాదనలు వినిపించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు కారు పార్టీ నాయకులు కంగారుతో మాట్లాడుతున్నారని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది. నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కారణమని బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారాన్ని హస్తం పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు.

మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై బీఆర్ఎస్ బిన్న వాదనలు?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ రేవంత్ రెడ్డి సర్కార్‌కు నివేదికను అందించింది. ఈ నివేదికను రద్దు చేయాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణ సమయంలో మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు వరదలే కారణమని కేసీఆర్, హరీశ్ రావు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకురావడం గమనార్హం. పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిన తర్వాత మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు పేలుడు కారణమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2022లో రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు తట్టుకున్నాయన్న ప్రవీణ్‌కుమార్‌.. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. 2023 అక్టోబర్ 21 సాయంత్రం 06: 20 గంటలకు మేడిగడ్డ పిల్లర్ల వద్ద భారీ శబ్దాలు వచ్చాయని అప్పట్లో మేడిగడ్డ అసిస్టెంట్ ఇంజినీర్ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ఆ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంతకు ముందు బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీవారే బరాజ్‌కు బాంబులు పెట్టి పేల్చేసి ఉంటారని తనకు అనుమానం ఉన్నదని చెప్పారు. ఈ బరాజ్‌ను మావోయిస్టులు పేల్చివేశారా? అనే కోణంలో కూడా పోలీసులు అప్పట్లో దర్యాప్తు చేశారు. మొత్తానికి కుంగుబాటు వెనుక కుట్ర కోణం లేదని అప్పటి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటించారు.

పీసీ ఘోష్ కమిషన్ ముందు ఎందుకు మాట్లాడలేదు?

పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు హాజరయ్యారు. కేసీఆర్‌ను ఘోష్ కమిషన్ ముఖాముఖి విచారించింది. హరీశ్ రావును మాత్రం బహిరంగంగా విచారించారు. కమిషన్‌కు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు అందించారు. అయితే తమకు 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్, హరీశ్ రావు తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. కేసీఆర్, హరీశ్ రావుకు 8బీ కిందే నోటీసులు ఇచ్చినట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కమిషన్ విచారణ సమయంలో ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడలేదని అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. వరదల వల్లే బరాజ్ కుంగిపోయిందని హైకోర్టులో వాదనలు వినిపించిన బీఆర్ఎస్ నాయకులు.. కమిషన్ విచారణ ముగిసిన తర్వాత బరాజ్ కుంగుబాటుకు కుట్ర కోణం ఉందని ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. బరాజ్ కుంగిన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, బాంబులు పెట్టినవారిపై అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తున్నది. కమిషన్ అడిగిన అంశాలకే సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున ఇతర విషయాల గురించి వివరించలేకపోయినట్టు బీఆర్ఎస్ చెబుతోంది.

కోర్టుకు వెళ్లి తొందరపడ్డారా?

జ్యుడిషియల్ విచారణతో చర్యలు తీసుకొనే అవకాశం ఉండదు. అయితే ఇలాంటి విచారణలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. జ్యుడిషియల్ విచారణలో ఈ అంశం తేలిందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం. అయితే రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకే ఈ కమిషన్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. అసెంబ్లీలో ఈ విషయమై చర్చించిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఈ కమిషన్ నివేదికను ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. ఆ సమయంలో చర్చ సందర్భంగా తమ వాదన వినిపించే అవకాశం బీఆర్ఎస్‌కు ఉంది. కానీ, ఈ నివేదికను రద్దు చేయాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంపై సెల్ఫ్ గోల్‌ చేసుకోవడమేననే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.