KTR Jana garjana Rallies | ఫిరాయింపు ఎమ్మెల్యేలే టార్గెట్‌.. వారి సెగ్మెంట్లలో కేటీఆర్‌ సభలు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న బీఆరెస్‌.. సదరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నది. వాటిలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన గర్జన పేరిట సభలు నిర్వహిస్తూ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

KTR Jana garjana Rallies | ఫిరాయింపు ఎమ్మెల్యేలే టార్గెట్‌.. వారి సెగ్మెంట్లలో కేటీఆర్‌ సభలు

(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

KTR Jana garjana Rallies | బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతలు టార్గెట్‌గా వారి నియోజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ‘జనగర్జన’ పేరుతో సభ లు నిర్వహిస్తున్నారు. వారి తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఉన్న వారికి నేనున్నానంటూ ఈ సభల ద్వారా కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వదిలి.. కాంగ్రెస్‌లో చేరారు. వారిపై వేసిన కేసులో బీఆరెస్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు ఖాయమని, వాటితో ఉప ఎన్నికలు కూడా వస్తాయని భావిస్తున్న బీఆరెస్‌.. ఆ యా నియోజకవర్గాల్లో దూకుడు పెంచింది. కేటీఆర్ జన గర్జన పేరుతో సభలు నిర్వహిస్తున్నది. పార్టీ ఫిరాయించడం తప్పనే ధోరణి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ.. ‘పార్టీ కి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలు వస్తే చిత్తుగా ఓడించాలి’ అని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే గర్జన సభలకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. పార్టీ వీడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై గద్వాలలో నిర్వహించిన జన గర్జన సభలో కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ కండువా వేసుకుని సుప్రీం కోర్టు తీర్పుతో యూ టర్న్ తీసుకుని నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పుకొంటున్న బండ్ల.. గర్జన సభకు రాకపోవడం చూస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందని దుయ్యబట్టారు.

గువ్వలపైనా నిప్పులు
ఉమ్మడి జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీని వీడి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గువ్వల అహంకారానికి అడ్డే లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అధిష్ఠానం అండతో నోటి దురుసు ఎక్కువై పలు వివాదాల్లో చిక్కుకున్నారని జిల్లా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గువ్వలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకోకుండా ఆయనకే వత్తాసు పలకడంతో మరింత రెచ్చిపోయారని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గువ్వల బాలరాజుకు నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. నోటి దురుసు, అహంకారమే ప్రజల ఛీత్కారానికి కారణమనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. ఓడినా ఆయనలో మార్పు రాకపోవడంతో పార్టీ అధిష్ఠానం పక్కన పెట్టింది. దీంతో గువ్వల బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్ళగక్కి బీజేపీలో చేరారు. పార్టీ వీడుతున్న విషయం తెలిసి కూడా గులాబీ బాస్ కేసీఆర్‌ పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులకు బీజేపీ కండువా వేసుకున్నారు. గువ్వల పార్టీ వీడటంపై కేటీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. గువ్వలకు పార్టీ లో సముచిత స్థానం ఇస్తే ఇలా చేస్తారా? అంటూ ఆగ్రహం చెందారు. అచ్చంపేటలో గువ్వల రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టేందుకు కేటీఆర్ జన గర్జన పేరుతో సభ నిర్వహించారు. ఆ సభ ద్వారా గువ్వలను ఏకిపారేశారు కేటీఆర్. అచ్చంపేటలో ఇక గువ్వల బాలరాజుకు రాజకీయ మనుగడ లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మారిన నేతల నియోజకవర్గాలనే కేటీఆర్ టార్గెట్ చేస్తూ బీ ఆర్ ఎస్ ఉనికి ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎంత కాలం పనిచేస్తుందో ముందు ముందు తెలుస్తుంది.