అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్‌ఎస్‌గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్‌?

టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ఆత్మ అనుకున్నారు ప్రజలు.. అందుకే ఉద్యమంలో అండదండలిచ్చారు.. రాష్ట్రావిర్భావం తర్వాత రెండు సార్లు అధికారం అప్పగించారు. కానీ.. మూడోసారి ఆ పార్టీ ఓడిపోయింది. పార్టీలో తెలంగాణ ఆత్మను తీసేయడం వల్లే ఓటమి సంభవించిందా? మళ్లీ టీఆర్‌ఎస్‌గా పేరు మార్చే ఆలోచన ఉందన్న కేటీఆర్‌ మాటల వెనుక అంతర్థామేంటి? ఇది అధికారం కోసమా? ఆత్మపరిశీలనా?

విధాత, ప్రత్యే క ప్రతినిధి:

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే ఆలోచన ఉందంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీతోపాటు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. మంచిర్యాల వేదికగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుకున్న అంతర్ధారం, అసలు అర్ధం, పరమార్ధం మాత్రం ఒక్క కేసీఆరే మాత్రమే చెప్పే అంశమంటున్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ పార్టీలోని ఇతర నేతలెవరూ ఈ అంశం పై స్పందించలేదు. ఆ పార్టీ మరో నేత హరీష్ రావుక్కూడా కష్టమే అయినప్పటికీ వీలైతే ఆయన మినహా దీనిపై స్పందించే సాహసం చేసే పరిస్థితి మరో నాయకుని మాత్రం లేదు. అందుకే కేటీఆర్ మాటలకు కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పే వ్యక్తికావడం, ఆయన కూడా ఈ వారంలోనే ఫాం హౌజ్ ను వీడి ప్రజాక్షేత్రంలోకి అంటే జగిత్యాలలో బహిరంగ వేదికపైకి రానున్న నేపథ్యంలో ఈ పేరు మార్పు పై ఏ విధంగా స్పందిస్తారనే చర్చ ప్రారంభమైంది.

టీఆర్ఎస్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందినపుడు ‘తెలంగాణ’ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన జోష్‌లో ఉన్నారు.. పైగా భారత రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావించి.. బీఆరెస్‌గా పేరు మార్చారు. ఆ నిర్ణయానికి అడ్డు చెప్పేవారు పార్టీలో లేరనేది బహిరంగ రహస్యమే. అప్పుడూ, ఇప్పుడూ ఆ పార్టీలో అదే పరిస్థితి. అందుకే అధికారం కోల్పోయిన మూడేళ్ళ తర్వాత కేటీఆర్ తాజా పార్టీ పేరు మార్పు ప్రకటన అంతరార్ధం, అసలు అర్ధం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక అధికారం కోల్పోయామనే బాధ ఉందా? లేక తెలంగాణ ప్రజలకు దూరమయ్యామనే నిజాయితీ ఉందా? అనేది తేలాల్సి ఉన్నది.

త్వరలో కేసీఆర్ మరో రాజకీయ వారసురాలిగా ఆ పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన కుమార్తె దేవనపల్లి కవిత నుంచి థ్రెట్ ఉందంటున్నారు. కొద్ది నెలల క్రితం హై డ్రామా, రాజకీయ పరిణామాల మధ్య కవిత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. కవిత తెలంగాణ రాజకీయ యవనికపై నూతన పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25వ తేదీన ముహుర్తం కూడా ప్రకటించారు. తండ్రి రాజకీయ వారసురాలిగా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతినిధిగా చెప్పుకుంటూ టీఆర్ఎస్‌కు పర్యాయంగా ఆమె పార్టీ పేరును ప్రకటిస్తే బీఆర్ఎస్‌కు ఇప్పుడున్న కష్టాలకు మరికొన్ని ఇక్కట్లు తోడయ్యే అవకాశం ఉంది.

కేసీఆర్ ఎక్కువగా ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి రాజకీయ క్షేత్రంలో బావా, బామ్మర్దుల మధ్య పోటీ ఉన్నప్పటికీ కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా హరీశ్‌రావుకంటే.. కేటీఆర్‌కే ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గత పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ ఉత్సావాలు వరంగల్‌లో నిర్వహించిన సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ మినహా మరో నాయకున్ని ఆ పార్టీ ప్రమోట్ చేసేందుకు ఇష్టపడలేదు. చివరికి కన్న కుమార్తె కవితకు కూడా కనీస ప్రాధాన్యం ఇవ్వలేదనేది బహిరంగ అంశమే. ఈ స్థితిలో అన్నకు పోటీగా తెలంగాణ అనే పేరు వచ్చేలా కవిత కొత్త పార్టీ పెడితే.. రానున్న రోజుల్లో బీఆరెస్‌కు ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ కారణంగానే కేటీఆర్ మాటల్లో పార్టీ పేరు మార్పు అంశం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కన్నవారిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు… ఏడిపించకూడదంటూ చేసిన వ్యాఖ్యల సారంశం కూడా దీని నుంచే చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన కన్నబిడ్డలాంటి టీఆర్ఎస్‌ను కన్న కుమార్తె హైజాక్ చేస్తే కేసీఆర్‌కు మానసిక సమస్యలు తప్పవనే భావన ఇందులో ఉందని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ ముందుగానే తిరిగి పార్టీ పేరు మార్పు వ్యాఖ్యలు చేశారంటున్నారు.

తెలంగాణలో ఎండల మోత.. 44°C వరకు ఉష్ణోగ్రతలు, 18 వరకు ఆరెంజ్ అలర్ట్

టీఆర్ఎస్ సెంటి‘మంట’.. అధికార పంట

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం సాక్షిగా పురుడుబోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీగానే కాకుండా తెలంగాణకు పర్యాయపదంగా పరిణతి చెందిందంటే అతిశయోక్తికాదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ అనే భావన అప్పట్లో ప్రజల్లో వేళ్ళూనుకుంది. ఈ ప్రాంత, ఈ ప్రజల హక్కులు, ఆశలు, ఆకాంక్షలు, అవకాశాలకు నిర్వచనంగా ఆ పార్టీ పేరు మారింది. ఒక దశలో ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతూ ఇబ్బందులను తొలగించే ఒక రాజకీయ పరిష్కారంగా ప్రజలు ఆ పార్టీని భావించారు. అందుకే పద్నాగేళ్ళ ఉద్యమ సందర్భంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనేక ఒడిదుడుకులు, ఏకపక్ష నిర్ణయాలు, కొన్ని తప్పులు, పొరపాట్లు, రాజకీయ అవకాశవాద విధానాలు అవలంబించినా అంతిమంగా ఆ పార్టీని తెలంగాణ ఆత్మగా ప్రజలు భావించి అక్కున చేర్చుకున్నారు. కేసీఆర్‌ను ఆకాశానికెత్తుకున్నారు. ఆయన బిడ్డలు కేటీఆర్, కవితను తమ నేతలుగా భావించారు. రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకూ అన్ని రకాల అండదండలందించి, సమైక్యవాదుల కుట్రలను చేధించి, బలిదానాలు చేస్తూ కూడా ఆ పార్టీని కాపాడుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త రాష్ట్రం తెర్లు కాకూడదని, కాంగ్రెస్‌ను కాదని రాష్ట్రంలో తొలి అధికార అవకాశాన్ని టీఆర్ఎస్‌కు అప్పగించారు. ఇక నుంచి తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అంటూ కేసీఆర్ ప్రకటించినప్పటికీ సహించారు. ఒక్కసారి అధికారంతో తెలంగాణ ఆకాంక్షలు పూర్తిగా అమలు చేయలేకపోయానంటే నమ్మి రెండవ పర్యాయం కేసీఆర్‌ను అందలమెక్కించారు. పదేళ్ళ పాలనలో ప్రజల గొంతు నొక్కేసినా, ప్రతిపక్షాలను మాట్లాడనీయకపోయినా, ఫిరాయింపులను ప్రోత్సహించినా, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు, బంగారు తెలంగాణ బ్యాచ్‌ను భుజాలకెత్తుకున్నా టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే నమ్మకాన్ని ప్రజలు పెంచుకున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ నాయకులు వమ్ముచేశారనే ఆరోపణలున్నాయి.

ఏఐ లేఆఫ్‌ ట్రాప్‌… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?

జాతీయ రాజకీయాలపై ఆశతో బీఆర్ఎస్

తెలంగాణలో రెండవ పర్యాయం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంతోపాటు, దేశ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్, రాష్ట్రాన్ని కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రెండు పర్యాయాలు కేసీఆర్ అధికారంలో కొనసాగిన తర్వాత పార్టీగా, రాజకీయంగా, ఆర్ధికంగా అంతనంత ఎత్తుకు ఎదిగారు. జాతీయంగా రాజకీయ సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా అక్కడ చక్రం తిప్పేందుకు పావులు కదిపారు. ఈ క్రమంలో తన జాతీయ రాజకీయ ప్రవేశానికి పార్టీ పేరు, ప్రాంతీయ పార్టీ గుర్తింపు అడ్డంకిగా మారడంతో కన్నతల్లిలాంటి పార్టీ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌గా మార్చిన సంగతిని పలువురు గుర్తు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు, విస్తృతంగా ప్రకటనలు, ప్రచారం, ఇతర రాష్ట్రాల్లో మృతి చెందిన రైతు కుటుంబాలకు నజరానాలు, సైనిక కుటుంబాలకు అండగా నిలువడమే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్రలో పట్టుసాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని కుమారుడికి అప్పగించి, తాను జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారనే విమర్శలున్నాయి. కేసీఆర్ లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఉద్యమ నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండడం దేశప్రయోజనాలకు మంచిదే అయినప్పటికీ పార్టీ పేరు మార్పు ముఖ్యంగా తెలంగాణ అనే సెంటిమెంటు, ప్రజల బావోద్వేగాలతో ముడివేసుకున్న ‘తెలంగాణ’ అనే పేరు లేకుండా పోవడం మానసికంగా ఇబ్బందికి గురిచేసింది.

ఇప్పటికీ నేతల నోట్లో టీఆరెస్సే…

అయినా ఇప్పటికీ ఇతర రాజకీయ పార్టీల నేతలు, ఆ పార్టీ నేతలు, ప్రజలు కూడా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ అంటూ సంబోధిస్తూనే ఉంటారు. అదేంటోగానీ, బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఖమ్మం వేదికగా అట్టహాసంగా భారీ హంగామాతో సభ నిర్వహించారు. మూడవ పర్యాయం రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చతికిలపడిపోయారు. ఈ దెబ్బతో జాతీయ రాజకీయ ప్రవేశానికి దారులు మూసుకపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. దీంతో మొట్టమొదటిసారి లోక్‌సభలో బీఆరెస్‌కు ఎంపీ లేకుండా పోయారు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ పార్టీకి పెద్దగా సానుకూలించిన అంశాలేవీ లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అధికారం, సెంటిమెంట్, రాజకీయ అవసరం

తెలంగాణ రాజకీయాల్లో తిరిగి తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే ఆలోచన ఉందని చెప్పడంగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో నష్టపోయామని ఆయన అంగీకరించడం రాజకీయంగా కీలక పరిణామంగా చెప్పవచ్చు. దీని వెనుక తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆకాంక్ష సహజంగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ ప్రజలకు దూరమైందని, అదే ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించడం గమనార్హం. అయితే బీఆర్ఎస్ కు ఇప్పుడు పేరు పరంగా, తెలంగాణ సెంటిమెంట్ పరంగా ఇతర పార్టీల కంటే ఇంటి పార్టీ నుంచే ఇబ్బందులున్నాయంటున్నారు. ఈ నెల 20 జగిత్యాలోగానీ, 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున ఈ లోపే కేసీఆర్ పార్టీ పేరు పై తిరిగి ప్రకటన చేస్తారా? అనే చర్చ సాగుతోంది. ప్రకటనే కాకుండా తిరిగి ఎన్నికల కమిషన్ వద్ద టీఆర్ఎస్ పాత పాత్రలోకి ప్రవేశించడం అంత ఈజీ కాదంటున్నారు.

Read Also |

కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు…
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

Latest News