CM Relief Fund issues | సీఎంఆర్ఎఫ్‌కు సీలింగ్!.. వైద్యం ఖర్చు ఎంతైనా ఇచ్చేది అంతేనట!
బాధితుల కష్టం చూసి, ముఖ్యమంత్రి ఉదారంగా సహాయం చేసే నిధి.. సీఎంఆర్‌ఎఫ్. గతంలో కనీసం సగమైనా వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా.. 60వేలకు మించి ఇవ్వటం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
విధాత, హైదరాబాద్ ప్రతినిధి:
CM Relief Fund issues | ప్రజలకు ప్రభుత్వం కానీ ఖర్చు లేకుండా అందించాల్సినవి రెండే రెండు.. అందులో ఒకటి విద్య.. రెండవది వైద్యం… దురదృష్టవ శాత్తు ప్రజలకు ఈ రెండే అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. సామాన్యప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. జలుబు చేసినా, జ్వరం వచ్చినా వేలల్లో ఖర్చు చేస్తే కానీ వైద్యం అందని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. వైద్యం కార్పొరేటీకరణ చెందిన తరువాత చిన్న చిన్న జబ్బులకు కూడా లక్షల్లో ఖర్చు పెడితేనే వైద్య సేవలు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ వైద్యం మొత్తం రాష్ట్రాన్నే శాసించే పరిస్థితి ఏర్పడిందనటం అతిశయోక్తి కాదేమో. మొత్తంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారింది.
వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారిన నేపథ్యంలో, ప్రైవేట్ వైద్య వ్యవస్థను నియంత్రించలేని స్థితిలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకు వచ్చారు. ఆరోగ్యశ్రీ లో వైద్య సేవలకు నిర్ణీత ఆదాయ పరిమితిని విధించారు. అయితే చాలా మందికి ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందని పరిస్థితికూడా ఏర్పడింది. అలాగే కొన్ని రకాల వైద్య సేవలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు.. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇలాంటి వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఎన్వోసీలు, బిల్లులు ఇచ్చేవారు. ఈ పద్ధతి 19 నవంబర్ 1977 నుంచి అమలులో ఉన్నది. పేద ప్రజలు, ఆర్థికంగా స్థోమత లేని వారు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో అత్యవసర చికిత్స చేయించుకోవడానికి సీఎంఆర్ఎఫ్ కింద ఎన్వోసీలు ఇవ్వడం కానీ, వైద్య చికిత్స అనంతరం బిల్లులతో ఆర్జీ పెట్టుకుంటే బిల్లులు విడుదల చేయడం కానీ జరిగేది. ఇది నిరంతర ప్రక్రియ. గతంలో రూ. 5 లక్షలు ఖర్చు అయితే కనీసం రూ. 3 లక్షలు ఇచ్చేవారు. ఇలా వైద్యానికి అయిన ఖర్చులో కనీసం సగం డబ్బులైనా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు బాధితులకు సహాయంగా అందించేవి.
కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. సాధారణంగా వచ్చే దరఖాస్తులకు ఒక తీరుగా, సీఎం కోటరీ సభ్యుల రికమండేషన్లకు ఒక తీరుగా ఉండేదనే విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. రాను రాను ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చే ఎన్వోసీలను పూర్తిగా రిజక్ట్ చేశారనే వాదనలు ఉన్నాయి. దీనిని రేవంత్‌రెడ్డి సర్కారు కూడా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఎన్వోసీలైతే ఒక్క నిమ్స్ ఆసుపత్రి తప్ప ఇతర ఆసుపత్రులో అనుమతించడం లేదని బాధితులు చెపుతున్నారు. ఎలాంటి ఎన్వోసీలు ఇవ్వకూడదని ప్రైవేట్ ఆసుపత్రులకు అల్టిమేటమ్ జారీ చేశారని విశ్వసనీయ సమాచారం. ఏ ఆసుపత్రిలోనైనా పేషంట్ అత్యవసర చికిత్స కోసం జాయిన్ అయి సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకుంటాం ఎన్వోసీ ఇవ్వమంటే ఆయా ఆసుపత్రులు ఇవ్వడం లేదని తెలుస్తున్నది. తమకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేనే ఎన్వోసీ ఇస్తామని కరాఖండిగా చెపుతున్నారని సమాచారం. నిమ్స్ ఆసుపత్రిలో మాత్రం పేషంట్లు ఎన్వోసీ ఇస్తున్నారు.
పేద రోగులకు అత్యవసర వైద్యం ఖర్చు లేకుండా ఏ ఆసుపత్రిలోనైనా అందించడానికి ఉపయోగ పడే ఎన్వోసీలకు తెలంగాణ ప్రభుత్వాలు మంగళం పాడాయి. అప్పులు చేసి వైద్యం పూర్తి అయిన తరువాత ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే అయిన ఖర్చులో 10 పైసల మందం కూడా రావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇదేమి అన్యాయమని అడుగుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు ఇద్దరు పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నేత ఇర్షాదొద్ధీన్ సోదరి వైద్య చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చు అయింది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం రూ. 60 వేల చెక్కు మాత్రమే ఇచ్చారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఇర్షాదొద్ధీన్ పార్టీ కోసం సర్వం త్యాగం చేస్తే నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. చెక్కుని చించి వేశాడు. పార్టీకీ రాజీనామా చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తే తాము ప్రైవేట్ హాస్పిళ్లకు ఎందుకు వెళతామని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పేరుకే ప్రభుత్వంలో పెద్దాసుపత్రులున్నాయి కానీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవని , అందుకే తాము ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయించాల్సి వస్తుందని చెపుతున్నారు.
అనధికారికంగా కొనసాగుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల సీలింగ్ ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుడు ఎంత ఖర్చు పెట్టుకుని అయినా వైద్యం చేయించుకుంటే 60 వేల రూపాయల సీలింగ్ పెట్టడం వల్ల బాధితులకు న్యాయం జరగట్లేదన్నారు. ప్రభుత్వం ఈ సీలింగ్ ఎత్తేసి, సముచితమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఇవికూడా చదవండి..
Kunamneni Sambasiva Rao : కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ
Bihar Elections 2025| నితీశ్, మోదీ మ్యాజిక్ కాదు.. మానిప్యులేషన్! అంతా ఆ పథకమే చేసింది!!
Rythu Bharosa Scheme : లోకల్ ఎలక్షన్స్ ముందు రైతు భరోసా ఇస్తారా?
Narayana School Flexi Viral | తల్లిదండ్రులారా..నైటీలు, నిక్కర్లు వేసుకొని రావద్ధు: పాఠశాల ఫ్లెక్సీ వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram