Doomsday Predictions | 2026లో ప్రపంచం అంతమవుతుందా? బాబా వంగా అంచనాల వెనుక నిజాలు ఏమిటి?
2026లో ప్రపంచం అంతమవుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది. బాబా వంగా, నోస్ట్రడామస్ పేర్లతో ప్రచారంలో ఉన్న డూమ్స్‌డే వాదనల వెనుక అసలు నిజం ఏమిటి? ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఈ భయాలను ఎలా పెంచుతున్నాయో విశ్లేషించే ‘విధాత’ ప్రత్యేక కథనం.
Doomsday Predictions 2026: The Truth Behind Baba Vanga’s Viral Prophecies | Vidhaatha Special Story
(విధాత ప్రత్యేకం)
Doomsday Predictions | 2026 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన చర్చ జోరందుకుంది—ఈ ఏడాదితో ప్రపంచం అంతమవుతుందని. “సబ్ ఖతం, టాటా బైబై…” అంటూ మీమ్స్, వీడియోలు, పోస్టులు మొదట హాస్యంగా అనిపించినా, కొద్దిరోజుల్లోనే అవి భయాందోళనలు కలిగించే ప్రచారాలుగా మారాయి. ముఖ్యంగా బాబా వంగా, నోస్ట్రడామస్ వంటి ‘భవిష్య వాచకు’ల పేర్లను జతచేసుకుని వ్యాపిస్తున్న కథనాలు ప్రజల మనసుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ వాదనల వెనుక వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే, భవిష్యవాణిల స్వభావం, ప్రపంచ రాజకీయ వాతావరణం, సోషల్ మీడియా అల్గోరిథమ్స్—అన్నీ కలిసి ఎలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయో సమగ్రంగా పరిశీలించాలి.
బాబా వంగా, నోస్ట్రడామస్ పేర్లతో పుట్టిన 2026 ప్రళయ కథనం
బల్గేరియాకు చెందిన బాబా వంగా(Vangeliya Pandeva Gushterova) 1911లో జన్మించి, 1996లో మరణించారు. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన వంగా, ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో ఆమె భవిష్యవాణి, దివ్యదృష్టి, రోగాలను నయం చేయడం వంటి మానవీతీత శక్తులను ప్రదర్శించినట్లుగా తూర్పు ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే 2026లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులు సంభవిస్తాయని కూడా చెప్పినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వంగా పేరుతో వ్యాపిస్తున్న జోస్యాల్లో మూడో ప్రపంచ యుద్ధం, గ్రహాంతర వాసుల ఆగమనం, భారీ ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మేధ ఆధిపత్యం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె ప్రవచనాలన్నీ మౌఖికంగానే ఉన్నాయని భావిస్తున్నందున, ఈ వాదనలలోని వాస్తవాలను పరిశీలిస్తే అవన్నీ పుకార్లలో భాగమని స్పష్టమవుతుంది. ఆమె చెప్పినట్లు భావిస్తున్న భవిష్యత్ సమాచారానికి ఎటువంటి రాతపూర్వక ఆధారం లేదు, అధికారిక రికార్డు లేదు. వంగా అనుచరులు, తరువాతి తరాల వ్యాఖ్యానాలు, సోషల్ మీడియా ఊహాగానాలు.. ఇవే కాలక్రమంలో ప్రవచనాల్లా మారాయి.
నోస్ట్రడామస్ అనే భవిష్యవాచకుడు కూడా కవితా రూపంలో రాసిన క్వాట్రైన్లు(నాలుగు పంక్తులున్న పద్యం లాంటిది) కూడా ఇలాగే అస్పష్టంగా ఉండటం వల్ల ఏ పరిస్థితికైనా వాటిని అన్వయించుకోవచ్చు. అథోస్ సలోమ్, రియాజ్ గోహర్ షాహీ, ఈబో నోవా వంటి స్వయంప్రకటిత “భవిష్యవాచకులు” గతంలో చెప్పిన అనేక అంచనాలు తప్పిపోయినా, సోషల్ మీడియా వాటిని తిరిగి ప్రళయ కథనాలుగా మార్చుతోంది. ఏ సంవత్సరం ఉద్రిక్తత పెరిగినా ఏదో ఒక ప్రవచనం దానికీ సరిపోతుంది— ఇదే అంతుచిక్కని ఈ భవిష్యవాణిలతో అసలు సమస్య.
ప్రపంచ రాజకీయ అస్థిరత అసలు కారణం
2026 ప్రారంభం సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైనిక–రాజకీయ పరిస్థితులు ఈ ప్రళయ వాదనలకు సహజంగానే వేదికగా మారాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు పెరిగాయి. వెనిజువెలా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్రంప్ అంతుపట్టని చర్యలు ప్రపంచాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అమెరికా–చైనా వ్యూహాత్మక పోటీ మరో దశకి చేరుకుంది. ఆసియా, యూరప్ మార్కెట్లలో ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల్లో అనిశ్చితి, ఆందోళన, భయం కలిగిస్తున్న అంశాలు. అలాంటి సమయంలో “ప్రపంచం అంతమవుతుంది” అనే కథనం ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుంది.

సైకాలజిస్టులు దీనిని “Cognitive Closure” అంటారు. అంటే, మనసులో అనిశ్చితిలో, సందిగ్థంలో ఉన్నప్పుడు, అబద్ధాన్నైనా బల్లగుద్ది చెపితే మన మెదడు దాన్ని ఆమోదిస్తుంది. ఆ ధోరణిని సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఇంకా ఎక్కువ చేస్తాయి. భయాన్ని కలిగించే విషయం ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. అవే పోస్టులు ఎక్కువగా వైరల్ అవుతాయి. ఫలితంగా పుకార్లు వాస్తవాల్లా కనిపించడం మొదలవుతుంది. తప్పుడు సమాచారం కూడా ఇదే రీతిలో ప్రపంచాన్ని సునామీలా చుట్టేస్తుంది.
చరిత్ర, శాస్త్రం చెబుతున్న అంతిమ తీర్పు: 2026 ప్రళయం అసత్యం
ప్రపంచం 2026లో ముగియబోతుందనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. గతంలో Y2K, 2012 మాయన్ క్యాలెండర్ వంటి అంచనాలు పెద్ద ఎత్తున భయాందోళనలు కలిగించినా చివరకు అవి అపోహలేనని తేలింది. 2026లో పృథ్విని ఢీకొట్టే గ్రహశకలం లేనట్లు అంతరిక్ష పరిశోధనా సంస్థల నిరంతర పరిశోధనా సమా ట్రాకింగ్ డేటా నిర్ధారిస్తోంది. 7 నుండి 8 శాతం భూమి నాశనం అయ్యేంత స్థాయిలో సమాంతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు కూడా అత్యంత అసాధారణం. గ్రహాంతరవాసులతో ముఖాముఖి జరుగుతుందనే వాదనకు కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాన్ని రక్షణరంగ నిపుణులు పూర్తిగా తిరస్కరించలేకపోయినా, అది మానవజాతిని ముగించే స్థాయికి చేరే ముప్పు లేదని వారు చెబుతున్నారు.
నిజానికి బాబా వంగా తన ప్రవచనాల్లో ప్రపంచం అంతమయ్యే సంవత్సరం 5079గా సూచించినట్లు కూడా కథనాలు ఉన్నాయి. అయితే 2026పై వస్తున్న కథనాలు వాటికి విరుద్ధంగా ఉండటం, ఇవన్నీ వంగా పేరుతో జరుగుతున్న కొత్త ప్రచారాలు మాత్రమేనని తెలిసిపోతోంది.
అంతిమంగా, 2026 ప్రళయకాల సంవత్సరం కాదు. ఇది కేవలం అవాస్తవ సమాచార వేగాన్ని, భయం పెంపొందించే సోషల్ మీడియా నిర్మాణాన్ని, అనిశ్చితిలో తప్పుడు ఊహాగానాలు ఎలా పెరుగుతాయో చూపించే ఉదాహరణ మాత్రమే. నిజానికి ప్రమాదకరమైనది ప్రళయం కాదు—ప్రళయం పేరుతో వ్యాపించే అసత్యం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram