Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్‌డేట్.. ఒక్క దెబ్బకు కాంగ్రెస్‌కు మూడు ప్రయోజనాలు!
చాలా చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తున్నాయని ఉన్న గుడిసెలను, రేకుల షెడ్లను తొలగించి పునాదులు కట్టి ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళంతా సర్కారు సహాయం కోసం కళ్లుకాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యకు కాంగ్రెస్ సర్కారు పరిష్కారం చూపెడుతోంది.

Indiramma Housing Scheme | విధాత, ప్రత్యేక ప్రతినిధి: పేదలకు ఇండ్ల నిర్మాణం విషయంలో తమ ప్రభుత్వానికి, గత బీఆరెస్ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో పూర్తి నిర్లక్ష్యానికి లోనైన ఇండ్లనిర్మాణ పథకాన్ని ఇందిరమ్మ పథకం పేరుతో చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ పథకంలో నిర్మాణాల్లో ఉన్న ఇండ్లతో పాటు తాజాగా, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జోడించి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు వచ్చే నెల 15 వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన టార్గెట్ ను ఎప్పటికప్పుడు ఏ మేరకు చేరుకున్నారనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతస్థాయి అధికారులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒక్కటే దెబ్బకు మూడు పిట్టలు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్‌ల పూర్తితో ఒక్కదెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ప్రయత్నిస్తోంది. ఇందిరమ్మ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన అర్హులైన పేదల ఇండ్ల నిర్మాణ కలను సాకారం చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. గత సర్కారు పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ బాధితులను ఆదుకొని సర్కారు మంచి పేరు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. ప్రత్యర్థి బీఆర్ఎస్‌ను జనంలో పలుచనచేయోచ్చనే రాజకీయ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నారు. దీంతో తమ ఓటు బ్యాంకు కాపాడుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించొచ్చనే భరోసాతో కసరత్తు చేస్తున్నారు.
‘డబుల్’ సమస్యకు పరిష్కారం
గత ప్రభుత్వహయంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ అర్హులకు రూ.5లక్షలు కేటాయించి ఇండ్లు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. గతంలో నిర్మాణం పూర్తయి అర్హులకు పంపిణీ చేయకుండా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అందించాలని నిర్ణయించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇండ్లు పూర్తయి పంపిణీకి నోచుకోకుండా పడావుపడుతున్న ఇండ్లు అర్హులకు అందేఅవకాశం ఉంది. ఇదిలా ఉండగా వీరి విషయంలో దరఖాస్తు ఎప్పుడు చేశారనే విషయాలు పట్టించుకోకుండా పేదలకు ఇండ్లివ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
కేసీఆర్ హయంలో డబుల్ ట్రబుల్
కేసీఆర్ కన్న కలగా చెప్పుకునే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి ఉద్యమ సమయంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు యావత్తు తెలంగాణ ప్రజలకు తెలిసిందే. అలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో కేసీఆర్ సర్కారు పూర్తి వైఫల్యం చెందించింది. అక్కడక్కడ డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ సకాలంలో పూర్తి చేయలేదు. పూర్తి చేసినా అర్హులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు. చాలా చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తున్నాయని ఉన్న గుడిసెలను, రేకుల షెడ్లను తొలగించి పునాదులు కట్టి ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళంతా సర్కారు సహాయం కోసం కళ్లుకాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యకు కాంగ్రెస్ సర్కారు పరిష్కారం చూపెడుతోంది.
జోరందుకున్న ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్రవ్యాప్తంగా లక్షా73వేల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 57వేల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 386.12 కోట్ల నిధులు విడుదల చేసినట్లు, ఇందులో రూ115 కోట్లు లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లో జమచేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తాజాగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 12700 మందిపై వివిధ రకాల అభ్యంతాలు రాగా, వీటిని జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 10,750 మంది అర్హులేనని తేల్చినట్లు.. అనర్హులకు ఈ పథకం వర్తింపచేయడం లేదని, గైడ్లైన్సు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పై గత వారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ విషయంపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు రాకుండా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నారు.